నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ విద్యపై అవగాహన కల్పించే లక్ష్యంతో చేపట్టిన ‘అన్న-అక్క మెంటార్షిప్’ కార్యక్రమాన్ని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలవుతుందని తెలిపారు. తెలంగాణలోని 150 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన సుమారు 53 వేల మంది తృతీయ సంవత్సరం డిగ్రీ విద్యార్థులు మెంటార్లుగా వ్యవహరిస్తూ, 9 వేల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు 30 గంటలపాటు శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. కళాశాల సమన్వయకర్తలు కిరణ్ కుమార్ గౌడ్, వివేకానంద, సుమన్ మాట్లాడుతూ, డిగ్రీ విద్యార్థులను మెంటార్లుగా తీర్చిదిద్ది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సీనియర్ విద్యార్థులు ‘అన్న-అక్క’లుగా మార్గనిర్దేశనం చేయడం వల్ల పాఠశాల విద్యార్థులు తమ సందేహాలను నిర్భయంగా నివృత్తి చేసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులు కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ విద్య, డేటా సైన్స్, పైథాన్ కోడింగ్, డిజిటల్ లెర్నింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ మెంటార్ షిప్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా బోధన పూర్తి చేసిన డిగ్రీ విద్యార్థులకు అకడమిక్ పరంగా రెండు ప్రత్యేక క్రెడిట్లు కేటాయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. రంగరత్నం, అధ్యాపకులు వినయ్ కుమార్, దండు స్వామి, రామస్వామి, రమేష్ గౌడ్, రాహుల్, షేక్ చాంద్, పూర్ణచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.