24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రోగులకు సరైన వైద్య సేవలు అందట్లేదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వైద్యుల కొరత కారణంగా రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని సీపీఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్ఎంఓ నవీనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్టీ నాయకులు ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా బెజ్గం సుజాత మాట్లాడుతూ అలాగే ఆసుపత్రిలో నిర్వహిస్తున్న స్కానింగ్ సేవల్లో పిక్చర్‌తో కూడిన పూర్తి నివేదికలు అందకపోవడంతో రోగులు తిరిగి ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. కొంతమంది వైద్యులు సమయపాలన పాటించకపోవడం, రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులే ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించడం వల్ల ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఆసుపత్రి వార్డుల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, కిటికీలు దెబ్బతిన్న స్థితిలో ఉన్నాయని తెలిపారు. నాలుగు లిఫ్టులు ఉన్నప్పటికీ కేవలం రెండు మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. తాగునీటి సరఫరా ప్రాంతంలో డ్రైనేజీ లీకేజీ కారణంగా అపరిశుభ్ర పరిస్థితులు నెలకొనడంతో రోగులు, వారి బంధువులు బయట నుంచి నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.

 

Patients are not receiving proper medical services.

 

రోగులతో పాటు వచ్చే అటెండర్ల కోసం ఏర్పాటు చేసిన షెడ్డు వద్ద రాత్రివేళల్లో కొందరు ఆకతాయిలు గుమికూడి గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్నారని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అలాగే ఆసుపత్రి బాత్రూంలలో నీటి సరఫరా లేకపోవడంతో రోగులు, అటెండర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ సులభ్ కాంప్లెక్స్‌లను ఉపయోగించేందుకు రూ.10 నుంచి రూ.20 వరకు చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఆసుపత్రిలో ఎక్కువగా వెస్ట్రన్ టాయిలెట్లు మాత్రమే ఉండటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు వాటిని సక్రమంగా వినియోగించలేకపోతున్నారని, దీంతో పరిశుభ్రత సమస్యలు తలెత్తుతున్నాయని స్వీపర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ఆసుపత్రి సమస్యల పరిష్కారానికి వైద్యశాఖ అధికారులు, ఆసుపత్రి యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యుడు నల్వాల నరసయ్య, నగర కమిటీ సభ్యురాలు అడివాల అనిత, పార్టీ సభ్యులు శ్రీదేవి, అంజయ్య, లలిత తదితరులు పాల్గొన్నారు.

 

Patients are not receiving proper medical services.

More articles

Latest article