29 C
Hyderabad
Monday, August 3, 2026

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదని, రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. యూరియా పంపిణీకి సంబంధించి ఇటీవల కొన్ని తాత్కాలిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు. తాడ్వాయి మండలంలోని ఒక పీఎసీఎస్ ద్వారా యూరియా కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం జరగడంతో పంపిణీలో అంతరాయం ఏర్పడే పరిస్థితి వచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమై అవసరమైన యూరియా లోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అవసరమైతే ప్రైవేట్ ఎరువుల దుకాణాల ద్వారా కూడా పంపిణీ చేసే అవకాశాలను పరిశీలించినప్పటికీ, అదనపు రవాణా, లేబర్ ఖర్చులు రైతులపై భారం పడే అవకాశం ఉండటంతో రైతులకు ఎటువంటి అదనపు వ్యయం లేకుండా పరిష్కారం చూపినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా పీఎసీఎస్ గోదాముల ద్వారా యూరియా సరఫరాను మరింత సులభతరం చేసే అంశంపై అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా యూరియా సరఫరాపై ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు అవసరమైన యూరియా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన మేర ఎరువులు అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం కామారెడ్డి జిల్లాలో యూరియా సరఫరాలో గాంధారి మండలం మొదటి స్థానంలో, సదాశివనగర్ మండలం నాలుగో స్థానంలో ఉన్నాయని తెలిపారు. ఈ రెండు మండలాలు ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఉండటం రైతులకు ఎరువుల సరఫరాపై ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యతకు నిదర్శనమని అన్నారు. యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌పై కొందరు అనవసర అపోహలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. రైతులకు నేరుగా, పారదర్శకంగా యూరియా అందించడమే యాప్ ప్రధాన లక్ష్యమని, రైతు పేరుతో బుకింగ్ అయిన యూరియా రైతుకే చేరే విధంగా వ్యవస్థను రూపొందించామని వివరించారు. దీని ద్వారా అక్రమ మళ్లింపులు, మధ్యవర్తుల జోక్యం, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. రైతుల సమస్యలను రాజకీయ కోణంలో కాకుండా పరిష్కార దృక్పథంతో చూడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రైతులను ఆందోళనకు గురిచేసే ప్రచారాల కంటే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాడ్వాయి మండలంలో రెండోసారి మొక్కజొన్న కొనుగోలు జరిగేలా కృషి చేయడం, జొన్నల కొనుగోలు కేంద్రాల కోసం పోరాడటం, ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేందుకు రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించడం, అలాగే ఎల్లారెడ్డి రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పైలట్ ప్రాజెక్టును తీసుకురావడం వంటి చర్యలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే నమ్మకంతో పనిచేస్తున్నానని, నియోజకవర్గంలో ఒక్క రైతు కూడా యూరియా కోసం ఇబ్బంది పడకుండా చూడటం తన బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు అవసరమైన యూరియా పూర్తిస్థాయిలో అందే వరకు పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.

More articles

Latest article