విజయవంతంగా 381 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు

0 14,219

 

. . . అరుదైన రికార్డు నెల కొల్పిన యశోద హాస్పిటల్స్ వైద్యులు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ యూనిట్ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డును నెలకొల్పింది. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి, డాక్టర్.పి.విజయ్ వర్మ బృందం ఇప్పటి వరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను అత్యంత విజయవంతంగా నిర్వహించి, ఎంతో మంది బాధితులకు పునర్జన్మ ప్రసాదించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్య నిపుణులు కిడ్నీ మార్పిడిలో తాము సాధించిన విప్లవాత్మక పురోగతిని వివరించారు. సాధారణంగా కిడ్నీ మార్పిడికి రక్త గ్రూపులు కలవడం ప్రధానం. అయితే, యశోద హాస్పిటల్స్ బృందం బ్లడ్ గ్రూప్ వేరుగా ఉన్న రోగులకు (ఏబిఓ – ఇన్ కంపాటిబుల్ ట్రాన్స్ ప్లాంట్) కూడా విజయవంతంగా కిడ్నీ మార్పిడి నిర్వహించి, వారు ప్రస్తుతం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా చేయడంలో విజయం సాధించింది.

. . . వయోభారంతో సంబంధం లేకుండా చికిత్స

శస్త్రచికిత్సల విషయంలో వయస్సు ఒక అడ్డంకి కాదని యశోద వైద్యులు నిరూపించారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులలో కూడా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి, వారి ఆయుష్షును పెంచడంలో కీలక పాత్ర పోషించారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ మైలురాయిని చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్. పి విజయ్ వర్మ మాట్లాడుతూ.. “కిడ్నీ వైఫల్యంతో బాధపడే రోగులకు డయాలసిస్ అనేది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. కానీ, కిడ్నీ మార్పిడి వల్ల రోగుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయి. మా బృందం సాధించిన ఈ 381 ట్రాన్స్‌ ప్లాంట్లు కేవలం సంఖ్య మాత్రమే కాదు, 381 కుటుంబాల్లో నిండిన వెలుగులు. రక్త గ్రూపులు వేరైనా కిడ్నీ మార్పిడి సాధ్యమే అన్న అవగాహన ప్రజల్లో పెరగాలి,” అని పేర్కొన్నారు. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో కిడ్నీ సంబంధిత వ్యాధులకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తూ, దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్‌ ప్లాంట్ సెంటర్‌గా ఎదుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.