. . . సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవన స్థితిగతులను దెబ్బతీసిందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో ఇంధన ధరలు పెరగడం అన్యాయమన్నారు. వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్.ఐ.ఆర్ పేరుతో ప్రతిపక్ష పార్టీల ఓటు హక్కును కాలరాసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. వెంటనే ఎస్.ఐ.ఆర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ప్రజాసంఘాలు, వామపక్ష, ప్రతిపక్ష పార్టీలు కలిసి తగిన బుద్ధి చెబుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎం. నరేందర్, జిల్లా నాయకులు ఎం. వెంకన్న, డి. రాజేశ్వర్, కే. గంగాధర్, ఎం. సుధాకర్ పాల్గొన్నారు. అదే విధంగా ప్రజాసంఘాల ప్రతినిధులు కే.సంధ్యారాణి, కే.గణేష్, ఎల్.అనిల్ కుమార్, అషుర్, సాయిబాబా, ఒడ్డెన్న, సాయరెడ్డి, భాస్కరస్వామి, విఠల్, అమూల్య, రమేష్, చరణ్, సాయిలు, సృజన్, మానస, లక్ష్మి, లలిత తదితరులు హాజరయ్యారు.
