. . . అత్యవసర వైద్య నిపుణులు డా.ఫణికృష్ణ, డా.రాహుల్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, విష ప్రయోగం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్రమైన గాయాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో “గోల్డెన్ అవర్”లో సరైన చికిత్స అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చని మెడికవర్ హస్పిటల్ అత్యవసర వైద్య నిపుణులు డాక్టర్ ఫణికృష్ణ, డాక్టర్ రాహుల్ తెలిపారు. ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం సందర్భంగా బుధవారం మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రతి నిమిషం ఎంతో కీలకమని, అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించడం చాలా ముఖ్యమన్నారు. డాక్టర్ ఫణికృష్ణ మాట్లాడుతూ, ప్రమాదాల్లో తీవ్ర రక్తస్రావం జరిగితే వెంటనే బ్లీడింగ్ కంట్రోల్ చేయడం, అవసరమైన ఫ్లూయిడ్స్ రక్తం అందించడం ద్వారా రోగి ప్రాణాపాయం తగ్గుతుందని తెలిపారు. గుండెపోటు వచ్చిన రోగులకు తక్షణ ఈసీజీ చేసి అవసరమైన అత్యవసర చికిత్స అందించడం వల్ల గుండె నష్టం తగ్గించవచ్చన్నారు. అలాగే శ్వాస సమస్యలతో వచ్చే రోగులకు ఆక్సిజన్ థెరపీ, వెంటిలేటర్ సపోర్ట్ వంటి చికిత్సలు సమయానికి అందించడం చాలా అవసరమని చెప్పారు. డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ, బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో “టైమ్ ఈజ్ బ్రెయిన్” అనే సిద్ధాంతం చాలా ముఖ్యమన్నారు. సమయానికి స్కానింగ్ చేసి చికిత్స ప్రారంభిస్తే పక్షవాతం ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలిపారు. విషప్రయోగం కేసుల్లో ఇంటి చిట్కాలు పాటించకుండా వెంటనే అత్యవసర విభాగానికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఫిట్స్, తీవ్రమైన జ్వరం, డీ హైడ్రేషన్ వంటి పరిస్థితుల్లో కూడా అత్యవసర వైద్య సేవలు ఎంతో కీలకమన్నారు. అత్యవసర విభాగంలో పనిచేసే వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నిరంతరం ఒత్తిడిలో పని చేస్తూ ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. అలాంటి సమయంలో వైద్య సిబ్బందిపై హింసాత్మక ఘటనలు జరగడం ఆందోళనకరమన్నారు. అత్యవసర వైద్య సిబ్బందికి సురక్షిత వాతావరణం కల్పించడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. చివరగా, అత్యవసర వైద్య సేవలు ప్రతి ప్రాణానికి రక్షణ కవచమని, సమయానికి సరైన చికిత్స అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చని డాక్టర్ ఫణికృష్ణ, డాక్టర్ రాహుల్ తెలిపారు.

