. . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
కామారెడ్డి, బతుకమ్మ :
మాది చేతల ప్రభుత్వమే కానీ మాటల ప్రభుత్వం కాదని, బిఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా స్పష్టంగా ఉందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కామారెడ్డిలో జిల్లా లో డీసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని వివరించారు. ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అందిస్తుందన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ఎక్కడ లేని విధంగా పారదర్శకంగా కుల గణన సర్వే నిర్వహించామన్నారు. అలాగే వరి వేస్తే ఉరి అని బిఆర్ఎస్ నేతలు అన్నారని, ఇప్పుడు రైతులపై బిఆర్ఎస్, బీజేపీ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దెవా చేశారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బిఆర్ఎస్ హయంలో కల్లాల్లో రైతులు ప్రాణాలు విడిచిన సంఘటనలు ఇంకా మేం మరిచిపోలేదని ఆయన గుర్తు చేశారు. ఎవరెన్ని చెప్పినా మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో 75 శాతంకి పైగా సీట్లు గెలిచామని గుర్తు చేశారు.

వచ్చే ఎన్నికల్లో కూడా జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇల్లు లేని పేదలకు ఇళ్లు అందజేయాలన్నది ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కల అని, దాన్ని నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి పలాయనం చిత్తగించినా మొక్కవోని ధైర్యంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల నేతృత్వంలో పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. అలాగే కార్యకర్తలందరూ కష్టపడి పని చేయాలని, కష్టపడిన వారిని పార్టీ తప్పక గుర్తిస్తుందని తెలిపారు. అనంతరం నూతనంగా నియమితులైన డీసీసీ కార్యవర్గం సభ్యుల తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, టీపీసీసీ కోఆర్డినేటర్లు, జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

