25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పంట వ్యర్థాల దహనంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి

 

. . . వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూసారం, పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వర రావు తెలిపారు. పంట వ్యర్థాల దహనాన్ని పూర్తిగా నివారించే దిశగా రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నిర్వహించిన “రైతు నేస్తం” కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పంట వ్యర్థాలను కాల్చడం అనేది కేవలం రైతులకే సంబంధించిన విషయం కాదని, ఇది సమాజం మొత్తం బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు, గ్రామస్థాయి స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి పంట అవశేషాలను కాల్చకుండా కలియదున్నే పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కర్బనం పదార్థం, ఉపయోగకర సూక్ష్మజీవులు నశించి భూసారం క్షీణిస్తుందని, తద్వారా పంటల దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా గాలి కాలుష్యం పెరిగి శ్వాసకోశ, కంటి, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఇటీవల పంట వ్యర్థాలను కాల్చే సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదాల్లో రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను ప్రస్తావిస్తూ రైతులు అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పంట అవశేషాలను కలియదున్నడం ద్వారా నేల సేంద్రియ కర్బనం పదార్థం పెరిగి భూసారం మెరుగుపడటంతో పాటు నేల తేమ నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, ఎరువుల వినియోగ వ్యయం తగ్గి పంట దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు. రైతులకు అవసరమైన రోటావేటర్లు, మల్చర్లు, శ్రెడర్లు, వంటి వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త రామాంజనేయులు పంట వ్యర్థాల దహనం వల్ల కలిగే శాస్త్రీయ, పర్యావరణ నష్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు తమ పొలంలో పంట అవశేషాలను కలియదున్ని అధిక దిగుబడులు సాధించిన రైతులు రైతు నేస్తం కార్యక్రమంలో వారి స్వీయ అనుభవాలను ఇతర రైతులతో పంచుకునే అవకాశం కల్పించబడింది. రైతులు పరమేశ్వర్ మంచిర్యాల జిల్లా, దేవేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా, శంకర్ అల్లీపూర్ నుండి, గంగారెడ్డి కల్లెడ జగిత్యాల నుండి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం జిల్లా నుండి హాజరై తమ అనుభవం పంచుకున్నారు. వ్యవసాయ కార్యదర్శి కె. సురేంద్రమోహన్ మాట్లాడుతూ పంట వ్యర్థాల దహనం వల్ల నేల నాణ్యత దెబ్బతినడమే కాకుండా పర్యావరణ కాలుష్యం పెరుగుతోందన్నారు. భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం, తగు మోతాదులో యూరియా వాడకం, పచ్చిరొట్ట పంటల సాగు, పంట అవశేషాల కలియదున్నడం వంటి అంశాలపై వ్యవసాయ శాఖ విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. రైతులు తమ ప్రాంత వ్యవసాయ అధికారులను సంప్రదించి శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగు చేపట్టాలని సూచించారు. పంట వ్యర్థాలను కాల్చడం పర్యావరణ పరిరక్షణ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని, సంబంధిత చట్టాల ప్రకారం జరిమానాలు విధించే అవకాశముందని అధికారులు సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భూసార సంరక్షణ కోసం రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా కలియదున్నే పద్ధతులను అనుసరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

 

Government pays special attention to crop waste burning

More articles

Latest article