. . . జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
. . . ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
అసిఫాబాద్, బతుకమ్మ :
ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న… పేదల సొంతింటి కలలను నిజం చేసే ప్రతిష్టాత్మక ‘ఇందిరమ్మ ఇండ్ల’ రెండో విడత కార్యక్రమానికి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వేదిక కానుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర, రెవెన్యూ, హౌసింగ్, సమాచార – పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జిల్లాలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. బుధవారం రాష్ట్ర ఆబ్కారీ, మద్య నిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసనమండలి సభ్యులు దండే విఠల్, జిల్లా కలెక్టర్ కె.హరిత, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తదితరులతో కలిసి మంత్రి పర్యటించారు. ముఖ్యమంత్రి సందర్శించనున్న ప్రాంతాలను పరిశీలించడంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పేదలకు గౌరవప్రదమైన జీవితం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన పొందుతోందన్నారు. జిల్లాలోని కొఠారి గ్రామంలో గిరిజన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం ద్వారా ఆదివాసీల సొంతింటి కష్టాలు తొలగిస్తున్నామని తెలిపారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహాలక్ష్మి, గృహజ్యోతి, రేషన్ కార్డులు, ఇందిరా మహిళా శక్తి, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా మహిళను కుటుంబానికి ఆధారస్తంభంగా గుర్తిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో 2026-28 సంవత్సరాలకు గాను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అర్హులైన పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

