. . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి తరహాలోనే తెలంగాణలో కూడా ‘డబుల్ ఇంజన్ సర్కార్’ ఉంటేనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా మే 10 న మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు ఇందూర్ జిల్లా నుండి ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆధ్వర్యంలో సుమారు 15,000 మంది కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లనున్నారని తెలిపారు. అలాగే ఈ చారిత్రాత్మక బహిరంగ సభకు నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఒక్కో ఇంటికి రూ.1,60,000 తో పాటు ఈజీఎస్ కింద మరో రూ.60,000 మొత్తంగా రూ.2,20,000 అందిస్తోందని, కేంద్రం ఇస్తున్న నిధులను ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వంతుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్రం నేరుగా సర్పంచుల ఖాతాల్లో వేస్తున్న నిధులను, రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా ఖాళీ అవ్వడంతో అక్రమంగా ఫ్రీజ్ చేసి మళ్లించుకుంటోందన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలను చూసి ప్రస్తుత రేవంత్ ఉద్దీన్ ప్రభుత్వం భయపడుతోందని, అందుకే రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి వెనుకాడుతోందని ఎద్దేవా చేశారు. 2016 లో కేవలం 3 సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో కార్యకర్తల కష్టంతో 2026 నాటికి 200 పైచిలుకు సీట్లు ఎలా సాధించామో, తెలంగాణలో కూడా ప్రస్తుతం ఉన్న 8 సీట్ల నుండి వచ్చే ఎన్నికల్లో 80 కాదు.. ఏకంగా సెంచరీ (100+) సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమన ధీమా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో పోతన్ కార్ లక్ష్మీనారాయణ, నగ్గోల్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ప్రమోద్ కుమార్, నాయిడి రాజన్న, బద్దంకిషన్, పుట్ట వీరేందర్, బీలోజి నాయక్, అనంతరెడ్డి, పడాల భూపతి, అంబదాస్ రావు, పసునూరి రమేష్, ఇప్పాకాయల కిషోర్, యాదాల నరేష్, అమంద్ విజయ్ కృష్ణ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

