. . . ఎం.సుధాకర్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్ల వేతనాలను వెంటనే పెంచాలని, ఖాళీ పోస్టులను భర్తీచేసి, పనిభారం తగ్గించాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం మోపాల్ కేజీబీవీలో 140వ మేడే పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో యుద్ధాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్నారు. వేతనాలు మాత్రం పెరగడం లేదన్నారు. ఈ అరకొర వేతనాలతో కనీస అవసరాలు కూడా తీరడం లేదన్నారు. కేజీబీవీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు. కేజీబీవీలకు కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు పెంచాలన్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 140వ మేడే స్ఫూర్తితో వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుమలత, కావ్య, పుష్పలత, పద్మ, వాసుకి, భారతి, లక్ష్మి, సంతోషి, మీనా, గంగామణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.
