. . . బసవేశ్వరుడి విగ్రహానికి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ :
కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా సమానత్వం ఉండాలని చాటి చెప్పిన మహానుభావుడు బసవేశ్వరుడు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆయన జయంతి ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆ రోజు బసవేశ్వరుడు పాటించిన ప్రజాస్వామిక విలువలు, తీసుకువచ్చిన మార్పులను మనం ఈ రోజుకూ స్మరించుకుంటున్నామన్నారు. ఆయన చెప్పిన సమానత్వం, సమాన అవకాశాల కోసం మనం ఈ రోజుకు పాటు పడుతున్నాం అంటే మనం వెనుకబడి ఉన్నట్టు లెక్క అని గుర్తు చేశారు. పార్లమెంట్ లో మహిళా బిల్లును పాస్ కాకుండా అనేక శక్తులు కుట్రలు చేసి అడ్డుకున్నాయని, బిల్లు పాస్ అయితే బాగుండేదని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ మహిళలకు ఎనిమిది సీట్లు ఇస్తే మరో పార్టీ పది సీట్లు ఇచ్చిందని, మొత్తంగా అసెంబ్లీలో ఎనిమిది మంది మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. బసవేశ్వరుడి నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తి పొందారని, బసవేశ్వరుడి స్ఫూర్తితో తాము ఏర్పాటు చేయబోయే పార్టీ రాజకీయ సామాజిక న్యాయం కోసం పని చేస్తుందని, 33 శాతం టికెట్లు, పార్టీ పదవులు మహిళలకు ఇస్తుందని తెలిపారు.

