23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

పాలసీల అమలులో పారదర్శకత పాటించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, పాలసీల అమలులో పారదర్శకత పాటిస్తేనే వ్యవసాయ రంగం నిలకడగా ఉంటుందని, అన్నదాతను ఆదుకోవడంలో జాప్యం చేస్తే దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం గంగాధరప్ప అధ్యక్షతన శుక్రవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శోభన్ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం కొన్ని పంటలకు ఎంఎస్‌పీ ప్రకటిస్తున్నప్పటికీ, దానికి చట్టబద్ధత లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు రైతులను నిలువునా దోచుకుంటున్నారన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ ప్రకటన స్వాగతించదగ్గదే అయినా.. రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్ తప్పులు, బ్యాంకు ఖాతాల అనుసంధానం వంటి సాంకేతిక కారణాల వల్ల వేలాది మందికి లబ్ధి చేకూరడం లేదన్నారు. ఎకరాకు రూ. 15,000 పెట్టుబడి సాయం హామీ ఇచ్చినప్పటికీ, సమయానికి నిధులు అందక రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. కౌలు రైతులను గుర్తించే సరైన యంత్రాంగం లేకపోవడంతో వారు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని, ధాన్యం సేకరణలో జాప్యం, తేమ శాతం నెపంతో విధిస్తున్న కోతలు రైతులకు శాపంగా మారాయని తెలిపారు. సన్న వడ్లకే బోనస్ పరిమితం చేయడం అన్యాయమని, ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. పంట సీజన్ ప్రారంభానికి ముందే రైతు భరోసానిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని, సాగుదారు ధృవీకరణ పత్రాలు ఇచ్చి, భూయజమాని హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులకు లబ్ధి చేకూర్చాలని పేర్కొన్నారు. ఐకేపీ సెంటర్ల ద్వారా 48 గంటల్లోనే నగదు చెల్లింపులు జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మటపది గంగాధర పాప వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న దేవేందర్ సింగ్, నాగలక్ష్మి, వడ్డెన్న, దేవుని రాజన్న, గణేష్, రాజేందర్, గంగారాం, చిన్నయ్య, లక్ష్మి, గంగమని తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article