. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
భారతీయ సంస్కృతికి భారతీయ కుటుంబ వ్యవస్థకు ఆధారం ఇంటి ఇల్లాలు మాత్రమేనని అందుకే మన సంస్కృతిలో మాతృదేవోభవ అని మొట్టమొదటి గౌరవాన్ని స్త్రీకే ఇచ్చారని నగర మేయర్ కూరగాయల ఉమారాణి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇందూరు జిల్లా మొట్టమొదటి మహిళా కౌన్సిలర్ మాదాసు నాగమ్మ యాదవ్ జ్ఞాపకార్థం ఆవిడ మేనల్లుడు మాదాసు స్వామి యాదవ్ శనివారం ఎల్లమ్మ గుట్టలోని మున్నూరు కాపు సంఘంలో సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేసిన ఆదర్శ మహిళల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేయర్ మాట్లాడుతూ ఒక ఇంటిని తీర్చిదిద్దడానికి స్త్రీ యొక్క శ్రమ ఎంతో ఉంటుందని, ఇంటిల్లిపాది యొక్క ఆరోగ్యానికి ఆనందానికి ముఖ్య కారణంగా ఇంటి ఇల్లాలే నిలుస్తుందని, అందుకే ఇల్లాలు లేని ఇంటిని దయ్యాల కొంపగా వర్ణిస్తుంటారని తెలిపారు. మహిళా దినోత్సవ సందర్భంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన సాధారణ కుటుంబ నేపథ్యం కలిగి ఉన్న మహిళలను ప్రత్యేకంగా ఎంపిక చేసి, తమ పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన మాతృమూర్తులను ఎంపిక చేసి మొట్టమొదటి మహిళా కౌన్సిలర్ అయిన తన మేనత్త పేరుతో ఈ విధంగా సన్మానంతో గౌరవించడం ఇలాంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గొప్ప విషయం అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్వామి యాదవ్ ను మేయర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ కృష్ణశాస్త్రి విజయభాస్కర్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ని చత్రపతిగా తీర్చిదిద్దింది అతని తల్లి జిజియా మాత అని, శాతకర్ణి మహారాజును వీర యోధుడిలా తీర్చి దిద్దింది అతని తల్లి గౌతమి మాత అని ఈ విధంగా ఈ దేశంలో పుట్టి చిరస్మరణీయులుగా నిలిచిపోయిన ఎంతోమంది మహనీయులు మహాయోధుల వెనక ఉన్నది వారి తల్లులు మాత్రమేనని, అందుకే స్త్రీ తలుచుకుంటే అసాధ్యం అనేది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. మహారాణి అహలియా భాయ్ హోల్కర్ భారతదేశంలోనే అతి పురాతనమైన ఎన్నో దేవాలయాలను పునర్నిర్మించి, హిందూ ధర్మానికి ప్రాణం పోసిందని ఆయన చెప్పారు. అహల్యాబాయ్ లేకపోయి ఉంటే ఈ రోజు కోట్లాదిమంది హిందువులు ముస్లింలుగా మారిపోయేవారని ఆయన గుర్తు చేశారు. భారత రాష్ట్రపతిగా ప్రస్తుతం సేవలు అందిస్తున్న ద్రౌపతి మురుము ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టిందని, ఉపాధ్యాయురాలిగా సేవలందించిందని ఇప్పుడు భారత రాష్ట్రపతిగా కూడా మాతృత్వ భావనతో పనిచేస్తుందని ఆయన తెలిపారు. ధనాన్ని ఇచ్చేది లక్ష్మీదేవి అని భారత దేశ ఆర్థిక మంత్రిగా కూడా ప్రస్తుతం నిర్మల సీతారామన్ వ్యవహరిస్తున్నారని మన దేశం రత్న గర్భ అని ఆయన గుర్తు చేశారు. కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు మాదాసు స్వామి యాదవ్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ మహిళలను భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా గౌరవిస్తారని అదే మార్గంలో మనందరం నడవాలని, పాలిచ్చే తల్లులే పాలించేందుకు అర్హులు అనే విషయాన్ని తన మేనత్త దశాబ్దాల క్రితమే నిరూపించిందని అందుకే ఆవిడ పేరు మీద ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మిక రంగం నుంచి రెంజర్ల కళావతి, మున్సిపల్ కార్మిక రంగం నుంచి అరుణ, మహిళా పొదుపు సమాఖ్య రంగం నుంచి జ్యోతి, ఆశా వర్కర్ కవిత, అంగన్వాడీ టీచర్ సుజాత, రేషన్ డీలర్ మాడవేటి శోభారాణినీ ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికురాలు బెలాల్ సావిత్రి మరియు మహిళలు, యువతులు తదితరులు పాల్గొన్నారు.
