. . . కుక్కల దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
రుద్రూర్, బతుకమ్మ :
గ్రామాల్లో వీధికుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రివేళల్లో రోడ్లపైకి గుంపుగుంపులుగా వచ్చి రోడ్లపై నుంచి వెళ్ళే వారిపై దాడులు చేస్తుండడంతో కుక్కలు కనబడితే చాలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. రుద్రూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి కుక్కల దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్టాండ్ ప్రాంగణంలో, వీధులలో గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, సైకిల్, ద్విచక్రవాహనదారులను వెంబడించి పరుగుపెట్టిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
