30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కబ్జా కోరల్లో దేవాంగ ఫంక్షన్ హాల్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాంగ్రెస్ కలెక్షన్ సెంటర్ గా మారిన సీ–కన్వెన్షన్ సెంటర్

 

. . . అడ్డూ అదుపులేని కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ రెడ్డి అవినీతి దందా

 

. . . కాంగ్రెస్ నేతల అరాచకాల ను అడ్డుకునేందుకు కలెక్టర్ జోక్యం చేసుకోవాలి

 

. . . నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

 

ఆర్మూర్, బతుకమ్మ :     

 

బడుగు, బలహీనులైన దేవాంగ సామాజిక వర్గం కోసం నిర్మించిన ఫంక్షన్ హాల్ అధికార పార్టీ నేతల కబ్జా కోరల్లో చిక్కుకుందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పర్యటించారు. తాను ప్రారంభించిన జనతా గ్యారేజ్ లో క్రైమ్ నెంబర్ 17 గా నమోదైన దేవాంగ ఫంక్షన్ హాల్ (సీ-కన్వీన్షన్ సెంటర్) ను ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పరిశీలించారు. దేవాంగ సామాజిక వర్గం నేతల ఫిర్యాదును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ’సీ–కన్వెన్షన్ సెంటర్’ కాంగ్రెస్ కలెక్షన్ సెంటర్ గా మారిందని మండిపడ్డారు. రామలింగ చౌడేశ్వర దేవి నిజామాబాద్ జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం కోసం తన వినతి మేరకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో గల రెండు వేల గజాల భూమిలో రూ. 75 లక్షలతో ఫంక్షన్ హాల్ నిర్మించినట్టు జీవన్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం 8 కోట్ల రూపాయల విలువైన ఈ ‘సీ –కన్వెన్షన్ సెంటర్’ పై నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ రెడ్డి కన్ను పడిందని, ఎలాగైనా దీనిని కబ్జా చేయాలనే దురుదేశ్యంతో అద్దె కోసమని చెప్పి ఆ ఫంక్షన్ హాల్ బాధ్యతను తన అనుంగు శిష్యుడైన భూపేందర్ కు అప్పగించాడని అయన వివరించారు. వినయ్ రెడ్డి కనుసన్నల్లో భూపేందర్ ఈ ‘సీ –కన్వెన్షన్ సెంటర్’ ను కాంగ్రెస్ కలెక్షన్ సెంటర్ గా, అవినీతి హెడ్ క్వార్టర్ గా మార్చారని ఆయనన్నారు. ఆర్మూర్ లో కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ రెడ్డి అవినీతి దందా అడ్డూ అదుపు లేకుండా సాగుతోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం వివిధ కుల సంఘాలకు నిర్మించిన ఫంక్షన్ హాళ్లను అధికార పార్టీ నేతలు నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ రెడ్డి అవినీతి భాగోతాలపై విచారణ జరిపించి చిప్పకూడు తినిపిస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల అరాచకాల ను అడ్డుకునేందుకు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన దేవాంగులకు న్యాయం చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్  వికార్యకర్తలు, నాయకులు  కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యువజన కమిటీ నాయకులు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article