. . . ఏఐఎస్ఎఫ్ నుంచే విద్యార్థి సంఘాలు పుట్టుకొచ్చాయి
. . . అన్ని విద్యార్థి సంఘాలకు మాతృ సంఘం ఏఐఎస్ఎఫ్
. . . విద్యార్థులు ముందు తరపు దూతలుగా ఉండాలి
. . . నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
. . . భవిష్యత్తు అంతా విద్యార్థులదే
. . . కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం రద్దు చేయాలని, ప్రభుత్వాలు కార్పొరేట్ యాజమాన్యానికి వత్తాసు పలుకకుండా, అందరికీ ఒకే ఉచిత విద్యా విధానాన్ని రూపొందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. భగత్ సింగ్, చేగువేరా స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోనీ టిటిడి కళ్యాణ మండపంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర 4వ మహాసభలు మూడు రోజులు పాటు నిర్వహించనున్నారు. ముందుగా మొదటిరోజు ప్రెస్ క్లబ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నీ ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శివ లింగ రాజన్ జండా ఊపి ప్రారంభించారు. ఏఐఎస్ఎఫ్ జెండాలు పట్టుకుని, తలకు రిబ్బన్లు కట్టుకొని విద్యార్థులు భారీ ఎత్తున నిర్వహించిన ఈ ర్యాలీ పులాంగ్ చౌరస్తా మీదుగా టిటిడి కళ్యాణ మండపానికి చేరుకుంది.

సభ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, విశిష్ట అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, మాజీ జాతీయ అద్యక్షులు తక్కెలపల్లి శ్రీనివాస్ రావు, ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శివ లింగ రాజన్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి బనోతు రఘురాం, ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల సమస్యలకై అలుపెరుగని పోరాటాలు చేస్తుందన్నారు.

అన్ని విద్యార్థి సంఘాలకు మూలం ఏఐఎస్ఎఫ్ అని, ఇది అన్ని సంఘాలకు తల్లి లాంటిదని అన్నారు. ఎందరో నాయకులు ఈ విద్యార్థి సంఘం ద్వారా ఎదిగారని, తాను కూడా ఈ సంఘం ద్వారా నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నానని గుర్తు చేశారు. క్రమశిక్షణ గల వాడే సరైన నాయకుడని, ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలన్నారు. ఓర్పు, సహనం ఎంతో అవసరమని, నాయకుడికి క్రమశిక్షణతో పాటు దేహదారుడ్యం కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు దేశభక్తితో పాటు తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలతో ఉండాలన్నారు. భవిష్యత్తులో మంచి స్థానంలో నిలవాలంటే తల్లిదండ్రుల కలలను నిజం చేయాలంటే లక్ష్యం నిర్దేశించుకుని అందుకు తగ్గట్లు కృషి చేయాలన్నారు. విద్యార్థులు ప్రణాళికతో చదివి, సమాజానికి కుటుంబానికి తోడ్పాటు అందించాలన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థులపై ఉందని, చెడు సహవాసాలు విడిచిపెట్టి, మంచి మార్గం వైపు అడుగులు వేయాలన్నారు. అందుకు ఏఐఎస్ఎఫ్ ఎంతో తోడ్పాటుని అందిస్తుందని, క్రమశిక్షణ నేర్పుతుందని, విద్యార్థులు ఎదుగుదలకు ఏఐఎస్ఎఫ్ బాటలు వేస్తుందన్నారు. విద్యార్థి దశలో దేశానికి ఏదైనా చేయాలని ఆకాంక్ష ఉంటుందని, అది భవిష్యత్తుకు పునాది అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా విధానంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మార్కుల కోసం కాకుండా జ్ఞానం పెంపొందించే దిశగా విద్యా విధానం ఉండాలన్నారు. విద్యార్థి నాయకులు సైతం అలాంటి పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలో 4వ రాష్ట్ర మహాసభలు ఇంత గొప్పగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని, అందుకు పనిచేసిన ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గానికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ లక్ష్యం కోసం పని చేయాలన్నారు. కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా అభివృద్ధికి, విద్యార్థుల కోసం నిధులు కేటాయిస్తున్నారన్నారు. జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. జిల్లాకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తుందన్నారు. విద్యార్థులు హక్కులు ఏంటో తెలుసుకొని ఆ హక్కుల సాధన కోసం పాటుపడాలన్నారు. విద్యార్థి దశ కీలకమని మంచి మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శివలింగ రాజన్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ ప్రైవేట్, కార్పొరేట్ యజమాన్యాల చేతుల్లోకి వెళ్లిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయని, ఇది సరైన నిర్ణయం కాదన్నారు. ఉచితంగా నాణ్యమైన విద్యను అందించినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. నాణ్యమైన విద్య కోసం ఏఐఎస్ఎఫ్ అలుపెరుగని పోరాటాలు చేస్తుందని, మా పోరాటాల వల్లనే విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం యూజీసీ ద్వారా ఉన్నత విద్యాసంస్థలకు నిధులు రాకుండా చేస్తుందన్నారు. విద్యార్థులు భగత్ సింగ్, చేగువేరా హీరోలుగా గుర్తించాలని, సినిమా హీరోలని కాదని ఈ సందర్భంగా సూచించారు. నిజామాబాద్ జిల్లాలో నాలుగవ రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఆఫీస్ బేరర్స్ ఇటికెల రామకృష్ణ, గ్యార నరేష్, రెహమాన్, కాసోజు నాగజ్యోతి, బరిగేలా వెంకటేష్ , ఏఐకేఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజారెడ్డి, రాజేశ్వర్, రాజన్న, స్వరూపరాణి, విట్టల్ గౌడ్, దశరథ్, పాల్గొన్నారు.

