నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాలను నగరంలో గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు జయంతి ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలను వివిధ సంఘాలు, ఆర్య మరాఠా యువత, హిందూ బంధు మిత్రుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జయంతి ఉత్సవ నిర్వాహకులు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. అలాగే కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొని ఆశీర్వదించాలని వారు కోరారు. గురువారం మధ్యాహ్నం 1.00 గంటలకు కుమార్ గల్లీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి, సాయంత్రం 4.00 గంటలకు విఠలేశ్వర్ ఆలయం నుండి శివాజీ చౌక్ వరకు శోభాయాత్ర, సాయంత్రం 4.30 గంటలకు కుమార్ గల్లీ దుర్గా మాత ఆలయం నుండి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్య స్థాపనకు, ధర్మరక్షణకు, ప్రజాహిత పాలనకు ప్రతీకగా నిలిచారని తెలిపారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడానికి నగర ప్రజలు, యువత, మహిళలు, హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
