. . . ప్రజలు వాస్తవాలను గమనించాలి
. . . మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్
బాన్సువాడ, బతుకమ్మ :
కేటీఆర్ కార్నర్ సభపై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు రాజకీయ అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై కొందరు నాయకులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రెస్ మీట్‌లో గోవర్ధన్ మాట్లాడుతూ, బాన్సువాడలో కనిపిస్తున్న అభివృద్ధి అంతా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బాన్సువాడకు వచ్చి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఇటీవల జరిగిన కేటీఆర్ కార్నర్ సభపై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్న గోవర్ధన్, ప్రజల సమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. ఈ వయసులో పార్టీ మారడం వెనుక ఉన్న ఉద్దేశాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బాన్సువాడ ప్రజలు అభివృద్ధి చేసిన వారికే ఓటు వేస్తారని, రాజకీయ అవకాశవాదానికి తగిన సమాధానం చెబుతారని గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షానే నిలబడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి శ్రీనివాస్, అంజిరెడ్డి, సాయిబాబా, రత్నకుమార్, సాయిలు, శ్రీనివాస్ తదితరులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
