29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

అభివృద్ధి, సంక్షేమం పట్టని కాంగ్రెస్, బీజేపీ

Must read

📰 Generate e-Paper Clip

. . . కాంగ్రెస్ అంటేనే ఫాదర్ ఆఫ్ చీటర్స్ పార్టీ

 

. . . ఇక్కడి కాంగ్రెస్ నేతలు బ్రోకర్లు, బీజేపీ నేతలు జోకర్లు

 

. . . ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జి పీవీఆర్ అవినీతికి అంతే లేదు

 

. . . ఆర్మూర్ బీఆర్ఎస్ లో భారీగా చేరికలు

 

. . . బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో దూసుకుపోయిన వెలుగు జిలుగుల ఆర్మూర్ నేడు అనాథగా మారి కన్నీరు పెడుతోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆర్మూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన మట్టల ప్రవీణ్, రాజ్యలక్ష్మిలతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారందరినీ జీవన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి సాదరంగా అహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం పట్టని కాంగ్రెస్ , బీజేపీల నేతలు బ్రోకర్లు, జోకర్లుగా మారారని ఎద్దేవా చేశారు. మందికి పుట్టినోళ్లు మావోళ్ళే అనడం ఈ రెండు పార్టీల నైజమని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలను తామే తెచ్చామని చెప్పుకోవడానికి  కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సిగ్గులేదా? అని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేకు దమ్ముంటే ఆర్మూరు అభివృద్ధికి డిల్లీ నుంచి నిధులు తేవాలన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీని గాలికొదిలేసిన కాంగ్రెస్ నాయకులు దోచుకు తినడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాం ఆర్మూర్ పట్టణానికి స్వర్ణ యుగమన్నారు. రేవంత్ సర్కార్ రాక్షస పాలనతో రాతియుగం దాపురించిందని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న పదేళ్లలో ఆర్మూర్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానని ఆయన చెప్పారు. ఆర్మూర్ పట్టణం తన హయాంలో ఎట్లుంది? నేడెట్లుంది ? అని ఆయన ప్రశ్నించారు. వంద కోట్ల నిధులు తెచ్చి ఆర్మూర్ ను సుందర పట్టణంగా తీర్చిదిద్దానన్నారు. రూ. 15కోట్ల 60లక్షలతో  పట్టణమంతా రోడ్లు వేయించానని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఆర్టీసీ, ఆలూరు వంటి బైపాస్ రోడ్లు నిర్మించి ఆర్మూర్ కు మణిహారాలుగా అలంకరించానన్నారు. పట్టణంలో 18 పార్కులు నిర్మించానని, గూండ్ల చెరువు మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి రూ. 4కోట్లు మంజూరు చేయించానని, మల్లారెడ్డి చెరువు అభివృద్ధికి రూ.3కోట్లు మంజూరు చేయించానని, కోటి రూపాయల నిధులు వెచ్చించి 10జిమ్ లు ఏర్పాటు చేయించానని జీవన్ రెడ్డి వివరించారు. నిజాం సాగర్ కెనాల్ పై వంతెన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేయించానని, మూడు నుంచి అయిదు వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఆర్మూర్ నియోజకవర్గాన్ని తీర్చి దిద్దానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన తులం బంగారం, స్కూటీలు, పెంచి ఇస్తామన్న పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఆర్మూర్ ను పట్టించుకున్న నాధుడే లేడు. కాంగ్రెస్ ఫాదర్ ఆఫ్ చీటర్స్ పార్టీ. బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెట్టే విచ్ఛిన్నకర శక్తి. అర్వింద్ ఒక ఫాల్స్, ఫ్రాడ్, ఫేక్ ఎంపీ. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఒక జోకర్ అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీ నిజామాబాద్ జిల్లాలో ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని, నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని అనడం మత విద్వేషాలు రెచ్చగొట్టడమేన ని ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీకి దమ్ముంటే ముందు అహ్మదాబాద్ పేరు మార్చాలని, డిల్లీ పేరును హస్తినాపురం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జి పీవీఆర్ అవినీతికి అంతే లేదని విమర్శించారు.  కాగా ఓడినా, గెలిచినా తన జీవితమంతా ఆర్మూర్ ప్రజల సేవకే అంకితమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నివర్గాల ప్రజలు తన ఆత్మబంధువు లన్నారు.ఎవరికి ఏ ఆపదొచ్చినా అండగానిలుస్తానని, అన్నా అని పిలిస్తే నేనున్నానంటూ తోడుగా వస్తానని ఆయన అన్నారు. ఆర్మూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి శిఖరంగా మారుస్తానని ఆయన పేర్కొంటూ తనను ఓడించినందుకు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అధ్బుతమైన పాలనతో ఆయన దేశాన్నే కదిలించారన్నారు. మళ్లీ కారే రావాలి, సారే కావాలి, ఈ అబద్దాల కాంగ్రెస్, జిత్తులమారి బీజేపీ పోవాలి అని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ గెలవడం ఖాయమని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

More articles

Latest article