నిజామాబాద్, బతుకమ్మ : ధాన్యం దిగబడులు వానాకాలంలో అంతంత మాత్రమే రావడంతో వ్యవసాయ ఖర్చులు రైతులకు భారంగా మారాయి. ఎకరాకు 30 నుంచి 32 క్వింటాళ్ల దిగుబడి వచ్చే ధాన్యం ప్రస్తుతం 20 నుండి 25 క్వింటాళ్లకు మించి రావడం లేదు. దీంతో రైతుపై 10 నుంచి 15 వేల అదనపు ఖర్చులు భారంగా మారాయి. దీనికి తోడు వరి కోతలు ఊపందుకున్న నేపథ్యంలో అకాల వర్షాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి. ఒకపక్క వరి కోత కోసిన ధాన్యం నీటిలో తేలియాడుతుంటే మరో పక్క కొయ్యని వరి ధాన్యం నేలకొరిగి మొలకలు వస్తున్నాయి. నేలకొరిగిన ఒక ఎకరా వరి పంటను కోయడానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. వరి కోత మిషన్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. కనీస ఖర్చులు ఎల్తాయో లేవో అని ఆందోళనతో రైతులు దిగులు పడుతున్నారు. కొండంత ఆశతో ధాన్యాన్ని సాగు చేస్తున్న రైతులు గోరంత లాభం రాకుండా అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రైతు కల్లాల నిండా వర్షం నీరు ఉండడంతో రైతు కంట కన్నీళ్లు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కనికరించి రైతులను ఆదుకోవాలని తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తలించి రైతులకు అండగా కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకొని నష్టపరిహారాన్ని చెల్లించాలని మాక్లుర్ మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో ధాన్యం తేమ శాతాన్ని 17 నుంచి 21 శాతానికి పెంచాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
బోనస్ రైతు కష్టాన్ని భర్తీ చేయలేదు
రైతులకు దిగుబడులు భారీగా తగ్గినప్పుడు బోనస్ తో మేలు జరుగుతుంది. రైతుకు వర్షం పూర్తి నష్టాన్ని కలిగిచింది. దీనికి తోడు చీడపీడలు ఆశించి వరి పంటలో కంకి నల్లి,మెడవిర్పు, కాటుక తెగుళ్లు వరి పంటలు తీవ్రంగా నష్టాన్ని కలిగించాయి. వీటి నివారణకు రైతులు శతవిధాల ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. అకాల వర్షాలు పూర్తిగా ముంచాయి.
నీటిలోనే ధాన్యం కుప్పలు
కొత్తపల్లిలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేశా. వరి పంటను గత వారం రోజుల కింద కోసి ఎండబెట్టా. ప్రాథమిక సహకార సిబ్బంది మ్యాచర్ చూసి వచ్చిందని చెప్పారు ఇంతలోనే వర్షం కురియడంతో ధాన్యం పూర్తిగా తడిసి కుప్పలు నీటిలో తేలియాడుతున్నాయి. బోనస్ ప్రకటించడంతో కొనుగోలు కేంద్రంలో విక్రయించి బోనస్ పొందుదామనుకున్నాను. రైతులకు అధికారులు న్యాయం చేయాలి.
-సాదుల అర్జున్



