- ఇసుక.. నల్లమట్టి… ఇటుక బట్టీలు.. మొరం గుట్టలు స్వాహా
- చెరువుల నుంచి నల్లమట్టి తవ్వకాలు
- వాగులు వంకల నుంచి ఇసుక తవ్వకాలు
- ఇటుక బట్టీల నుంచి మామూళ్లు అని ఆరోపణలు
- అనుమతులు లేని మొరం తవ్వకాలు
- అధికార పార్టీ ప్రజా ప్రతినిధిపై బీజేపీ ఆరోపణలు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉండగ భారతీయ జనతా పార్టీ మాత్రం రూరల్ కానిస్టేన్సీ ని టార్గేట్ చేసింది.. ప్రకృతి సంపద (వనరుల) ను ప్రజా ప్రతినిధి అండతో కొల్లగొడుతున్నారని ఆరోపణలు చేస్తుంది. తొమ్మిది నియోజకవర్గాలలో ఐదుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఒక బీఆర్ఎస్, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా కేవలం నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులను టార్గేట్ చేయడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తున్నది. రూరల్ ఎమ్మెల్యే గా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారీ దినేష్ మూడవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లాలో అతి పెద్ద నియోజకవర్గంగా నిజామాబాద్ రూరల్ కు పేరుంది. నిజామాబాద్ అర్బన్ చుట్టూర ఉన్న నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం. అటు కామారెడ్డి, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు బోదన్, బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉన్న అతి పెద్ద నియోజకవర్గం.

ఉమ్మడి జల్లాలో విస్థీర్ణంలో అతిపెద్ద నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ దే. నిజామాబాద్ గ్రామీణ ప్రాంతంలో ప్రకృతి సంపద (వనరులకు) కొదవ లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న సహజ వనరులను తెగ కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ పనులకు అని స్థానికంగా తహసీల్థార్ ల ద్వార అనుమతులు తీసుకున్నామని చెబుతు వాగులు వంకల్లోని ఇసుకను దోచేశారు. ఇక చెరువులలో నల్లమట్టిని వ్యవసాయ పొలాలకు తరలించాల్సి ఉండగా అక్రమంగా ఇటుక బట్టీలకు అమ్మేశారు. అది చాలదన్నట్టు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రకటన రాకముందే మొరం గుట్టలను తవ్వేశారు. గుండారం గుట్టలను ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే మాఫియా పార్టీలు మారి అధికార పార్టీ పేరున మల్కాపూర్, గుండారం, సిర్పూర్, ఇందల్వాయి గుట్టలు కరిగిపోయాయి. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల కోసమని అనుమతులు తీసుకున్నామని చెబుతు గుట్టలను కరిగిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారీ దినేష్ ఆరోపించారు. శుక్రవారం స్వయంగా నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ (ఏ) గుట్టలలో జరుగుతున్న తవ్వకాలపై స్థానికంగా నిజామాబాద్ రూరల్ తహసీల్ధార్ ను స్వయంగా ఫోన్ చేసి వివరణ అడిగితే తాము మొరం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పడం గమనార్హం.

నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో అధికార మార్పిడి జరిగిన నాటి నుంచి అవినీతి, అక్రమాలు, ఆమ్యామ్యాల వసూళ్లపై ఆరోపణలు చేస్తున్నాయి ప్రతి పక్షాలు అందుకు కారణం లేకపోలేదు. నిజామాబాద్ రూరల్, డిచ్ పల్లి, మోపాల్ మండలంలో అత్యధికంగా ఇటుక బట్టీలు ఉన్నాయి. వాటికి అనాధికారికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ల బోర్ వాడకంతో పాటు, చెరువులలో పూడికలలో తీసిన నల్లమట్టిని వ్యవసాయ భూములకు తరలించకుండా ఇటుక బట్టీల తరలించడంతో వారి వద్ద బలవంతపు వసూళ్లు చేశారని తొలుత ఆరోపణలు చేసింది. తరువాత ఇందల్వాయి, ధర్పల్లి మండలాల్లోని వాగుల నుంచి ఇసుకను తవ్వి రాత్రికి రాత్రే తరలింపుల ఆరోపణలు చేసింది. గుండారం గుట్టలను స్వాహా చేశారు. తిర్మన్ పల్లి గుట్టల్లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కు ముప్పు వాటిల్లేలా తవ్వకాలు చేశారు. మల్కాపూర్ గుట్టలను తవ్వేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ముందే తిర్మన్ పల్లి, గుండారం గుట్టలను ఇండస్ట్రీయల్ కారిడార్ ను ఆనుకుని ఉన్న గుట్టను వదల్లేదు. మొరం మాఫియా, ఇసుక మాఫియాలు అడ్డువచ్చిన వారిని ఖతం చేస్తామని బెదిరింపులకు పాల్పడుతు తవ్వకాలు చేయడం గమనార్హం. ప్రకృతి వనరులను కొల్లగొడుతూంటే అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం వెనుక అధికార పార్టీ నేతల కబంధ హస్థం పై ఆరోపణలు చేస్తుండగా అధికార పార్టీ నేతలు కిమ్మనడం లేదు. దానితో ప్రతిపక్షాలు వాయిస్ పెంచాయి.

- రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆశీర్వాదంతో మైనింగ్ దందా : బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి శుక్రవారం మొరం క్వారీలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని, ఈ దందాకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల కోసం భూములు కేటాయించిందని, కాంగ్రెస్ నేతలు దోపిడీకి దిగారని ఆరోపించారు. మల్కాపూర్, జాన్కంపేట్, ప్రాంతాల్లో మొరం మాఫియా రెచ్చిపోతుందన్నారు. రోడ్డుపై వందలాది టిప్పర్లు తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి లేక అవినీతి మాత్రం పెరిగిపోయిందన్నారు. ఇన్ చార్జి మంత్రులు కేవలం ఫోటోలు, ప్రకటనలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి క్వారీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నాలు, కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అధికారులు ప్రజల పక్షాన ఉండాలని హితవు పలికారు. ఒక అధికారి “ఎంఎల్ఏ చెప్తేనే పర్మిషన్ ఇస్తా” అని చెప్పడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. అధికారుల అనుమతితో అవినీతి నడుస్తుంటే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందన్నారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ ఆడియో కాల్‌ను మీడియా ముందు విడుదల చేశారు. దానిపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూపతి రెడ్డి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని దినేష్ పటేల్ డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ వెనక్కి తగ్గదన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పేదలను బెదిరించాలని చూస్తే ఊరుకోబోమని దినేష్ పటేల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాంచందర్,శంకర్ రెడ్డి,మండల అధ్యక్షులు ఆనంద్,కూరెళ్ల శ్రీధర్,నాయిడి రాజన్న, గోపి, ఓం సింగ్,యాదల నరేష్,అమందు విజయ్ కృష్ణ, వినోద్ రెడ్డి, శ్రీధర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు
- బీజేపీ వాళ్లు డబ్బులు డిమాండ్ చేశారు : మల్కాపూర్ ఒడ్డెర కులస్తులు
బీజేపీ వాళ్లు కావాలనే మాపై కుట్ర చేస్తుండ్రు. మూడు రోజుల క్రితం బీజేపీ వాళ్లు వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. మేము ఇవ్వం అని చెప్పినం. ఇదే మాట దినేష్ కులాచారి దగ్గర దాకా పోయింది. పట్టా పాస్ బుక్కు ఎమ్మార్వో దగ్గర పెట్టి డెవలప్ మెంట్ కోసం అడిగాం. అందులో భాగంగా మొరం తీసుకెళ్లి ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేస్తున్నాం.

