- బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, వాటర్ సెక్షన్, డ్రైవర్స్, స్ట్రీట్ లైట్స్ గార్డెన్స్ తదితర మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులంతా బహుజన శ్రామిక కులాలకు చెందిన వారు కాబట్టే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయడంలో కుల వివక్షతను చూపుతున్నాయని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ విమర్శించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి బహూజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్ టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో దండి వెంకట్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ లో శానిటేషన్ ,వాటర్ సప్లై వివిధ సెక్షన్లలో విధులు నిర్వహిస్తున్న ఎస్సీ,ఎస్టీ,బిసి మత మైనారిటీలకు చెందిన ఔట్ సోర్సింగ్ కార్మికులు నగర వీధులను, డ్రైనేజీలను శుభ్రం చేసే శానిటేషన్ కార్మికులు, జవాన్లు, డ్రైవర్లు…మరోవైపు ఉదయం ఐదు గంటలకు నగర ప్రజలకు మంచి నీళ్లు సకాలంలో అందించే వాటర్ సెక్షన్ కార్మికులు, వీధులను కాంతివంతంగా ఉంచే స్ట్రీట్ లైట్స్ కార్మికులు, ఉదయం ప్రజలు తమ ఆరోగ్యం కోసం వాకింగ్ చేసేందుకు పార్కులను పచ్చగా ఉంచే గార్డెన్స్ కార్మికులు — ఈ విధంగా మున్సిపల్ కార్పొరేషన్‌లో వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నారని తెలిపారు.

ఇలాంటి ఉన్నతమైన శ్రామిక సేవలకూ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పండగ సెలవులు, జాతీయ సెలవులు, అంబేడ్కర్ జయంతి, గాంధీ జయంతి, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) నాడుకూడా సెలవులే లేని ఏకైక శ్రామికులు మున్సిపల్ కార్మికులేనని వారికి లక్షల రూపాయల వేతనం ఇచ్చిన తక్కువేననని అన్నారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కారించపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత, యూనియన్ జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు లక్ష్మన్, ప్రధాన ఎం.ఎల్లయ్య , బిఎల్ టీయూ నగర అధ్యక్షులు అనిల్ కుమార్ కార్యదర్శి గంగా శంకర్, వాటర్ సెక్షన్ అధ్యక్షులు కొమ్ము రాహుల్, నాయకులు శ్రీశైలం, ఆర్, మురళి, గోపాల్, నవీన్, మోహన్ గౌడ్, నవీన్ కుమార్, సాయిలు, కె.సహాదేవ్, కృష్ణ, బిడిఎస్ఎఫ జిల్లా అధ్యక్షులు టి. సంజయ్ లతోపాటు కార్పొరేషన్ లోని వివిధ సెక్షన్లలలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు.

