26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పాలకవర్గం లేని పాలనకు ఏడాది పూర్తి

Must read

📰 Generate e-Paper Clip

  • నుడా చైర్మన్ నియాకమై సంవత్సరం
  • డైరెక్టర్ల నియామకాలకు కాంగ్రెస్ నేతల మోకాలడ్డు
  • అభివృద్దికి ఆమడ దూరంలో నిజామాబాద్ జిల్లా
  • సమీక్షలు లేకుండానే కొనసాగుతున్న పనులు
  • నుడాపై షాడోల పెత్తనం

 

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ధం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తి కావస్తున్నా నిజామాబాద్ అభివృద్దికి ఆమడ దూరంలో నిలుస్తోంది. అందుకు కారణం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా మిగిలిన ప్రాంతాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజామాబాద్ అభివృద్ది కోసమే ఏర్పాటైనా సంస్థగా నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (నుడా) ఉండగా దానికి జనజీవాలు లేక అస్తవ్యస్తంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ లో నంబర్ 2గా ఉన్న డీఎస్ హయంలోనే నుడాకు అంకురార్పణ జరిగింది. కానీ రాజకీయ సమీకరణల నేపథ్యంలో అది కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో నుడా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో నిజామాబాద్ నగరానికి చెందిన చామకూర ప్రభాకర్ రెడ్డి రెండేళ్ళకాలం చైర్మన్ గా పని చేశారు. వారి పాలకవర్గంలో సభ్యులతో కలిసి 88 గ్రామాలకు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తానికి విస్తరించి ఉన్న నుడా డెవలప్ కోసం స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పని చేశారు.

కాలం గిర్రున తిరిగింది. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఏడాది అయిన తర్వాత కానీ నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని పట్టించుకోలేదు. సరిగ్గా ఏడాది క్రితం నిజామాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణుకు నుడా చైర్మన్ బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఏడాది కాలంగా పాలకవర్గం లేకుండానే నుడా కాలపరిమితి సంవత్సరం ముగిసిపోయింది. డైరెక్టర్లు లేకుండానే ఏడాదిని గడిపేశారు పాలకులు. నుడా చైర్మన్ గా కేశ వేణును నియమించిన తర్వాత ప్రభుత్వం నుడా పరిధిలోకి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలను, మిగిలిన అన్నీ గ్రామాలను తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో నుడా డైరెక్టర్ల నియామకం కోసం ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఇంచార్జిల మధ్య సమన్వయం కుదరకపోవడంతో డైరెక్టర్ల నియామక ప్రక్రియ అటకెక్కింది. కాంగ్రెస్ పార్టీలో పని చేసిన నాయకులు ఎంతో మంది ఉన్నప్పటికీ కొత్తగా చేరిన వారికి ఇవ్వాలా? లేక పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఇవ్వాలా? అనేది నాయకులు తేల్చుకోలేకనే కనీసం తమ అనుచరులకు న్యాయం చేయలేక చేతులెత్తేశారు. దాంతో నుడా పాలకవర్గం ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయి ఏడాది గడిచిన ఇప్పటికి నుడా తరపున సమీక్షలు లేవు, అధికారులను సమన్వయం చేసే యంత్రాంగం లేకుండాపోయింది.

నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి పాలకవర్గం నియమించకపోయినప్పటికీ చైర్మన్ గా కేశ వేణు ఆధ్వర్యంలో ప్రస్తుతానికి పనులు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నాలుగు బల్ధియాలకు పాలకవర్గాలు లేకపోవడంతో అనధికారికంగా వాటిపై పెత్తనం కొనసాగుతుంది. అదే విధంగా పాలకవర్గాలు లేకపోవడం, స్థానిక ఎమ్మెల్యేలెవరికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఎమ్మెల్యేలే సుప్రీంగా పనులు జరుగుతున్నాయి. దానితో బల్ధియాలపై నుడా పెత్తనం వారి కనుసన్నుల్లోనే జరుగుతుందన్న వాదనలు లేకపోలేదు. ఇదిలా ఉండగా గడిచిన ఏడాది కాలంలో నుడా పరిధిలోకి గ్రామాలకు విలీనం చేసి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ బల్ధియాలను కూడా దాని పరిధిలోకే తెచ్చారు. ఏడాది కాలంలో 23 కోట్లతో పనులకు ప్రతిపాదనలు చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. త్వరలోనే ఆయా స్ట్రామ్ వాటర్, డ్రైనేజీలు, రోడ్ల కోసం శంకుస్థాపనలకు సిద్దమౌతుంది. అయితే నుడాకు పాలకవర్గం లేకపోవడంతో షాడోల పెత్తనం ఎక్కువైందన్న ఆరోపణలు మూటగట్టుకుంది. ప్రధానంగా అధికార పార్టీ నాయకులే షాడోలుగా వ్యవహరిస్తూ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకుల నుంచి, అపార్ట్ మెంట్ ల బిల్డర్ల నుంచి, షాపింగ్ కాంప్లెక్స్ యాజమానుల నుంచి బలవంతపు వసూళ్ళు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

  • అందరినీ కలుపుకొని వెళ్తా : నుడా చైర్మన్ కేశ వేణు

నుడా పరిధిలో డెవలప్ మెంట్ కు అందరినీ కలుపుకుని పని చేస్తాం. డైరెక్టర్ల నియామకం ప్రభుత్వ పరిధిలో ఉంది. అందరి సమన్వయంతో పాలకవర్గం నియామకం జరుగుతుంది. నుడా పరిధిలో త్వరలో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేస్తాం.

A year has passed since the ruling class-less regime was formed.

More articles

Latest article