- ప్రమోద్ సతీమణికి కోటి రూపాయల చెక్కు అందజేత
- అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా
నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బ్యాంక్ కాలనీలో ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన సతీమణి, పిల్లలను ఓదార్చారు. ఈ నెల 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ రౌడిషీటర్ రియాజ్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తరలిస్తుండగా కత్తితో పొడిచి చంపిన విషయం తెల్సిందే. రెండు రోజుల క్రితం రియాజ్ పోలీస్ ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా స్వయంగా డీజీపీ నిజామాబాద్ కు విచ్చేసి ప్రమోద్ కుటుంబాన్నిపరామర్శించి వారికి రూ.కోటి చెక్కును అందజేశారు. దాంతో పాటు ప్రభుత్వం ద్వారా 300 గజాల ఇంటి స్థలంతో పాటు పోలీసు శాఖ, పోలీసు వెల్పేర్ నుంచి ఇవ్వాల్సిన డబ్బులను అందజేస్తామని తెలిపారు. కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. అంతకు ముందు డీజీపీకి నిజామాబాద్ పోలీసు గెస్ట్ హౌజ్ లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీసు కమిషనర్ సాయిచైతన్యలు స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన డీజీపీ అధికారులతో సమీక్ష జరిపారు.
