25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇందూర్ జడ్పి చైర్ పర్సన్ పై నేతల కన్ను

Must read

📰 Generate e-Paper Clip

  • కాంగ్రెస్ లో పోటీ ఎక్కువ
  • బీజేపీ, బీఆర్ఎస్ ల నుంచి అభ్యర్థుల వేట
  • బీసీ మహిళా రిజర్వేషన్ పై అందరి నజర్

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పరిషత్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఈసారి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఎవరనే చర్చ మొదలైంది. శనివారం జిల్లా పరిషత్, మండల పరిషత్ ల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్లు ఖరారు చేసిన విషయం తెల్సేందే. సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. నిజామాబాద్ జిల్లా పరిషత్ కు మహిళ (బీసీ)కి రిజర్వు అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 31 మండలాల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో బీసీలకు 12, ఎస్టీలకు 3, ఎస్సీలకు 5, అన్ రిజర్వుడ్ 10 స్థానాల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీలకు 12 స్థానాలు కేటాయించగా అందులో 5 స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యాయి. జనరల్ లో 10 స్థానాలు ఉండగా అందులో 5 స్థానాలు మహిళలకు కేటాయించారు. బీసీలలో మహిళలకు రిజర్వు అయిన స్థానాలు మాక్లూర్, మోర్తాడ్, మెండోరా, మోస్రా, కోటగిరిలు ఉన్నాయి. అదే మాదిరిగా జనరల్ లో మహిళలకు కేటాయించిన స్థానాల్లో ఆర్మూర్ రూరల్, భీంగల్ రూరల్, ఎడపల్లి, చందూర్, రుద్రూర్ లు ఉన్నాయి. ఆయా ఓపెన్ కేటగిరి స్థానాల్లో బీసీ మహిళలు పోటీ చేసి గెలుపొందిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రేసులో నిలిచే అవకాశాలున్నాయి.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మహిళలు జిల్లా పరిషత్ చైర్ పర్సన్లుగా పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ అవకాశం తొలిసారి మళ్ళీ వచ్చింది. నిజామాబాద్ జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ గా సిలివేరి లలిత, రెండవ చైర్ పర్సన్ గా శారద సూర్యకాంత్, మూడవసారి గాదారి అనితలు పని చేశారు. వైస్ చైర్ పర్సన్ గా గడ్డం సుమనారెడ్డి పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కామారెడ్డికి తొలి చైర్ పర్సన్ గా దఫేదర్ శోభ పని చేశారు. నిజామాబాద్ జిల్లాకు మరోసారి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అవకాశం రావడంతో మహిళ లీడర్లు ఆసక్తి చూపుతున్నారు. వారితో పాటు వారి భర్తలు కూడా తమకు అవకాశం రాకపోయినా సతీమణిలను చైర్ పర్సన్ చేసి చక్రం తిప్పాలనే యోచనలోనూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అవకాశాలు బీసీలకే రావడంతో బీసీ లీడర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు.

Leaders eye Indore ZP chairperson

నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రేసులో మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత ముందు వరుసలో ఉన్నారు. గతంలో మాక్లూర్ ఎంపీపీగా పని చేసి జడ్పీటీసీగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోసమే గెలిచినప్పటికీ ఆనాడు కాంగ్రెస్ లో ఉండడంతో అవకాశం దక్కలేదు. ఇటీవల సొంత గూటికి కాంగ్రెస్ లో చేరిన ఆకుల లలిత ఎమ్మెల్సీ ఉప ఎన్నకల్లో లేదా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రిజర్వు కావడంతో ఆ స్థానంపై పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఈరవత్రి అనిల్ సతీమణితో పాటు అర్గుల్ మాజీ సర్పంచ్ గోర్త పద్మ సైతం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్థానాన్ని ఆశిస్తున్నవారిలో ఉన్నారు.  బీజేపీ తరపున  మొన్నటి వరకు ఆశించిన నేతలందరూ బీసీలు కాకపోవడం, మహిళలకు రిజర్వు కావడంతో కొంత స్తబ్ధత నెలకొంది. ఇటీవల వరకు స్థానిక సంస్థల ఎన్నికల కోసం తీవ్రంగా కసరత్తు చేసిన బీజేపీ ఇప్పుడు అభ్యర్థుల వేటలో పడింది. ఓటు బ్యాంక్ తో పాటు అనుకూల పవనాలు ఉండడంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా హక్కున చేర్చుకుని బరిలో దిగేందుకు సన్నద్దమౌతుంది. ఇక బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులెవరనేది ఇంకా తేలనే లేదు. ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్దం కాకపోవడంతో పార్టీ ఎవరిని చైర్ పర్సన్ అభ్యర్థిగా చేస్తుందనే విషయం డైలామా కొనసాగుతుంది.

More articles

Latest article