24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఐటీఐ, ఏటీసీ కేంద్రాలలో ప్రవేశాల పెంపునకు కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • అదనపు కలెక్టర్ అంకిత్

 

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని ప్రభుత్వ ఐ.టీ.ఐలు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో యువతీ, యువకులు ప్రవేశాలు పొంది, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకునేలా కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ లో గురువారం ఐ.టీ.ఐ కళాశాల ప్రిన్సిపాల్స్ తో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఐటీఐలు, ఏటీసీ కేంద్రాలలో ప్రవేశాల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 28వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లు కొనసాగుతున్నందున జిల్లాలోని అన్ని ఐ.టీ.ఐలలో నిరుద్యోగ యువత వివిధ కోర్సులలో ప్రవేశాలు తీసుకుని శిక్షణ పొందేలా చొరవ చూపాలని డీఆర్డీఓ సాయాగౌడ్, డీఐఈఓ రవికుమార్ లకు సూచించారు. ఐటిఐ ట్రేడ్స్ తో పాటు ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ లో నైపుణ్య ఆధారిత కోర్సులలో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని, ఆయా కోర్సుల ద్వారా యువతకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు, నిరుద్యోగ యువతీ, యువకులు ఐటిఐ, ఏటీసీ కోర్సులలో చేరేలా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. గ్రామగ్రామాన ఏటీసీ కేంద్రాల గురించి తెలియజేస్తూ, ఈ నెల 28వ తేదీ లోపు అర్హులైన వారు స్పాట్ అడ్మిషన్లు పొందేలా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. 10వ తరగతి ఉతీర్ణత కల్గిన అభ్యర్థులు నేరుగా ఐ.టి.ఐ కేంద్రాలకు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరై, ఆయా కోర్సులలో శిక్షణ కోసం ప్రవేశాలు పొందవచ్చని అన్నారు. ఈ సందర్భంగా స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి రూపొందించిన గోడప్రతులను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ప్రభుత్వ బాలుర ఐ.టి.ఐ ప్రిన్సిపాల్ జి.యాదగిరి, బోధన్ ఐ.టి.ఐ ప్రిన్సిపాల్ కె.శాంతారాం, కమ్మర్పల్లి ఐ.టి.ఐ ప్రిన్సిపాల్ ఎం.కోటిరెడ్డి, భీంగల్ ఐ.టి.ఐ సీనియర్ అసిస్టెంట్ టి.దామోదర్ చారి, ఏ.టీ.ఓ సిహెచ్.సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article