- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్ యందు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ఖలీల్ వాడి యందు ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతున్న సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాహనాదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి హాస్పటల్ సంబంధించిన వారు వారి పరిధిలో ఉన్నటువంటి మెడికల్స్ , పార్కింగ్ స్థలాలు , ఫుట్పాతులు , ఎంక్రోచ్మెంట్లు (ఆక్రమణలు) అంబులెన్స్ గురించి సంబంధిత డాక్టర్ల సూచనలు, సలహాల మేరకు భవిష్యత్తులో వాటి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం క్షుణ్ణంగా తెలియజేశారు. జిల్లాలోని అన్ని శాఖలను సమన్వయం పరుచుకుంటూ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కౌన్సిల్ భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలపై తక్షణ పర్యవేక్షణ చేసి వాటి నివారణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో రాజీవ్ గాంధీ ఆడిటోరియం పేడ్ పార్కింగ్ గా ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో 24 గంటల వరకు కారుకు 50 రూపాయలు, ఆటోకు 30 రూపాయలు, ద్విచక్ర వాహనానికి 20 రూపాయలు విధించడం జరుగుతుందని తెలిపారు. ఈ సౌకర్యాన్ని హాస్పిటల్స్ కు వచ్చేటటువంటి పేషెంట్లు, వారి బంధువులు కు తెలపాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మెడికల్ గైడ్లైన్స్ తూ . చా తప్పనిసరిగా పాటించాలని, సూచనలు ఎవరైనా పాటించని యెడల వారిపై ప్రభుత్వపరంగా గల జరిమానాలు లైసెన్సుల రద్దు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వా రెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ రాజశ్రీ, అదనపు మునిసిపల్ కమిషనర్ రవి, ఐఎంఏ ప్రెసిడెంట్ అజె శ్రీనివాస్, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ఐఎంఏ సంబంధించిన డాక్టర్లు పాల్గొన్నారు.

