- మూడేళ్ళ కాలంలో గంజాయిపై ఉక్కుపాదం
- అంతర్ రాష్ట్ర పరిధిలో గంజాయి కోసం ఆపరేషన్ లు
- ఎన్ ఫోర్స్ మెంట్ చరిత్రలో అనేక మైలురాళ్ళు
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. అందులో భాగంగా టీఎస్ న్యాబ్ నియామకాన్ని చేపట్టింది. ఇది వరకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోనే ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ విభాగాలు గంజాయి నియంత్రణకు పని చేసిన విషయం తెల్సిందే. గత కొన్నేళ్లుగా టీఎస్ న్యాబ్ ఏర్పడిన తర్వాత కూడా జిల్లాలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ (డీటీఎఫ్) విభాగాలు పని చేస్తున్న విషయం తెల్సిందే. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ పై అదే స్థాయిలో గంజాయిని నియంత్రించేందుకు అహర్నిషలు పని చేస్తున్నాయి. ప్రధానంగా గంజాయి మహమ్మారి మారుమూల పల్లెల్లోనూ విచ్చలవిడిగా వినియోగం జరుగుతుంది. మైనార్టీ తీరని యువత మొదలుకుని పెద్దవారి వరకు గంజాయి సేవను వ్యసనంగా మారింది. గంజాయి మత్తులో జరుగుతున్న ఆక`త్యాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్న విషయం తెల్సిందే. టీఎస్ న్యాబ్ తో పాటు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ టీంలు గంజాయి నిర్మూలనకు నడుం బిగించాయి.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధి కలిగిన ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గంజాయిని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు గంజాయి సాగుకు కేరాఫ్ గా ఉన్న జిల్లాలో ఇప్పుడు దాని ఉనికి లేకుండా చేసే ప్రయత్నం కొనసాగుతుంది. మన్యంతో పాటు ఏవోబి నుంచి మహారాష్ట్ర మీదుగా నిజామాబాద్ కు వస్తున్న గంజాయిపై ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ప్రధానంగా నజర్ వేసింది. మూడు సంవత్సరాల కాలంలో ఎన్నడు లేని విధంగా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ టీంలు చేసిన దాడులు కొత్త మైలురాళ్లుగా నిలిచాయి. కేవలం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిని దాటి పొరుగున ఉన్న మహారాష్ట్రలోనూ, కర్ణాటక వరకు వెళ్లి గంజాయి సూత్రదారులను పట్టుకున్న ఘనత దక్కించుకుంది. అంతేగాకుండా పొరుగున ఉన్న నిర్మల్ జిల్లా వరకు వెళ్లి గంజాయి రవాణాలో కీలక వ్యక్తులను పట్టుకోవడం ఎన్ ఫోర్స్ మెంట్ కే దక్కింది. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ల ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ల సహాయంతో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ చేస్తున్న పని తీరును కమిషనరే పిలిచి క్యాష్ రివార్డులతో పాటు ప్రశంసా పత్రాలను దక్కించుకునేలా చేసింది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు గంజాయి రవాణా చేస్తున్న కీలక సూత్రదారులను పట్టుకునేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ చేసిన దాడులు నిదర్శనంగా చెప్పాలి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ నుంచి తరలివస్తున్న 159 కిలోల గంజాయిని పట్టుకోవడం ఉదాహరణగా చెప్పవచ్చు.మూడు రోజుల పాటు బోకర్ లోనే తిష్ట వేసి గంజాయి బ్యాచ్ ను పట్టుకున్నారు. నవీపేట్ రైల్వేగేట్ వద్ద 75 కిలోల గంజాయి సైతం పట్టుబడింది. జిల్లాకు చెందిన ఎక్సైజ్ బాస్ లతో పాటు పోలీసు అధికారుల సమన్వయంతో బోకర్ కు వెళ్లి 84 కిలోల గంజాయిని పట్టుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రెండు వాహనాలను సీజ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోనూ 90 కిలోల గంజాయిని సరఫరా దారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. బోకర్ లోని గంజాయి స్మగ్లర్ ఫారూఖ్ ఖురేషి అనే వ్యక్తి నుంచి 30 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఆర్మూర్ లో 17 కిలోల గంజాయిని పట్టుకుని సూత్రదారుల గుట్టురట్టు చేశారు. 3 సంవత్సరాల కాలంలో గంజాయి రవాణాలో వినియోగించిన 50 వాహనాలను సీజ్ చేశారు. ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే మూడు ఆటోలను పట్టుకుని ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి 11 కిలోల గంజాయిని పట్టుకోవడం విశేషం. గంజాయి ఒక్కటే కాకుండా కల్లు తయారిలో వినియోగించే నిషేదిత మత్తు పదార్థం ఆల్ప్రాజోలంను కూడా దాదాపు 20 కిలోల దాదాపు రూ.2 కోట్ల విలువైన దానిని సీజ్ చేసిన ఘనత కూడా ఎన్ ఫోర్స్ మెంట్ దక్కించుకుంది.
- గంజాయి నిర్మూలనే లక్ష్యం : ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ స్వప్న
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు సంవత్సరాల కాలంలో గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపడంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ల సహాయ సహకారాలు, కమిట్ మెంటే కారణం. దానికి తోడు పోలీసు శాఖ కూడా సహాయ సహకారాలు అందించడంతో గంజాయి క్వింటాళ్ల కొద్ది జరిగే రవాణాను గ్రాముల వరకు తీసుకువచ్చాం. మునుపెన్నడు లేని విధంగా ఉమ్మడి జిల్లాలో గంజాయి వినియోగంపై ప్రధానంగా విద్యార్థులతో పాటు యువత బానిసలుగా మారడమే ఆందోళన కలిగించింది. వారికి భవిష్యత్తును కాపాడేందుకే గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. గంజాయి రవాణా, వినియోగం విషయంలో ఎలాంటి చిన్న సమాచారం దొరికినా రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఆపరేషన్లు నిర్వహించి అధికారుల సహకారంతో సరిహద్దులను దాటడం ద్వారానే నియంత్రణపై పట్టుసాధించగలిగాం. భవిష్యత్తులో గంజాయి గ్రాముల్లో కూడా దొరకకుండా చేయడమే లక్ష్యం.
