బతుకమ్మ, బోధన్ : ఎడపల్లి మండలం జైతాపూర్, తానాకలాన్ గ్రామాలలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జైతాపూర్ గ్రామంలోని పల్లె దవాఖానాను సందర్శించిన కలెక్టర్, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రూర్బన్ పథకం కింద నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన భవనానికి విద్యుత్ వసతి లేకపోవడాన్ని గమనించి, తక్షణమే విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. రూ. లక్షల నిధులు వెచ్చించి నిర్మించిన భవనాలకు చిన్నచిన్న సదుపాయాలు కల్పించే విషయంలో తాత్సారం చేయడం వల్ల అసౌకర్యం ఏర్పడుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ నూతన భవనాలకు పూర్తి స్థాయిలో వసతులు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ జరపాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ తానాకలాన్ గ్రామంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిలువ ఉన్న ఎరువులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ తరహాలోనే వచ్చే యాసంగి సీజన్ కు సంబంధించి కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు పంపిణీ జరిగేలా ఇప్పటినుండే ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని నిర్వాహకులకు సూచించారు. ఒకవేళ పట్టా పాస్ పుస్తకాలు లేని రైతులు ఎవరైనా పంటలు సాగు చేస్తుంటే, వారికి కూడా ఎరువులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అయితే, వారు పంటలు వేశారా లేదా అన్నది పక్కాగా నిర్ధారించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా యూరియా, ఇతర ఎరువుల కొరత లేదని, రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

