30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదారమ్మ ఉగ్రరూపం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, విష్ణుపూరి–బాబ్లి ప్రాజెక్టుల గేట్ల నుండి వరద నీరు వదిలేయడంతో గోదావరి ప్రవాహం ఉధృతమైంది. గోదావరి, హరిద్ర, మంజీరా సంగమించే ఈ పవిత్రక్షేత్రం వద్ద నిండుకుండల గోదారమ్మ గర్జనతో ఉప్పొంగిపోతోంది.

  • శివాలయం నీట మునిగింది..

సంగమం ఒడ్డున శతాబ్దాలనాటి పురాతన శివాలయం వరద ముంపుకు గురైంది. నది ఒడ్డున పెనువేగంతో తాకిన అలలు ఆలయాన్ని ముంచెత్తాయి. ఈ దృశ్యం చూసిన భక్తుల హృదయాలను కదిలిస్తోంది.

  • వంతెన దాకా ప్రవాహం..

పరవళ్లు తొక్కుతున్న నీరు వంతెన దాకా చేరుకోవడంతో అక్కడి దృశ్యం ఆహ్లాదకరంగానూ, భయానకంగానూ కనిపిస్తోంది. సంగమం వద్ద నిలబడితే గంగమ్మ ఉగ్రరూపం సాక్షాత్కారం అవుతున్నట్లుంటుంది.

  • పర్యాటకుల సందడి..

ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు, స్థానికులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. కెమెరాల్లో గోదావరి ఆవేశాన్ని బంధించేందుకు బ్రిడ్జి ప్రాంతం సందడిగా మారింది. వర్షపు చినుకులు, గాలివానల మధ్య గోదావరి అలల గర్జన చూడటానికి కందకుర్తి పుణ్యక్షేత్రం యాత్రికులకు ప్రత్యేక అనుభూతి కలిగిస్తోంది.

  • అధికారులు అప్రమత్తం..

వరద ఉధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. పరివాహక గ్రామాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని రెవెన్యూ, పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.

The fierce form of Godaramma at the confluence of Kandakurti and Triveni

More articles

Latest article