కుర్నాపల్లిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు
ఫాగింగ్ చేయించడంలో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శిపై ఆగ్రహం
నిజామాబాద్, బతుకమ్మ : ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు జరిపారు. పల్లె దవాఖానాను కలెక్టర్ తనిఖీ చేసి, నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు, అవుట్ పేషంట్ల రిజిస్టర్లను తనిఖీ చేశారు. టీ.బీ ముక్త్ భారత్ అభియాన్ అమలుతో పాటు సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. గ్రామంలో ఇతర ప్రాంతం నుండి వచ్చిన ఒకరికి డెంగ్యూ వచ్చిందని ఆరోగ్య కార్యకర్త శైలజ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యల గురించి సమీక్షించిన సందర్భంగా, స్ప్రే, ఫాగింగ్ చేయించడం లేదని వెల్లడి కావడంతో గ్రామ కార్యదర్శి సురేష్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నెలన్నర రోజుల నుండి పదేపదే చెబుతున్నప్పటికీ, ఇంతవరకు స్ప్రే ఎందుకు చేయించలేదని నిలదీశారు. అక్కడినుండే జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి, అన్ని జీ.పీలలో పక్కాగా ఫాగింగ్ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో గ్రామం వారీగా పరిశీలన జరిపించి, నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రతి పక్షం రోజులకు ఒకసారి తప్పనిసరిగా అన్ని నివాస ప్రదేశాలలో ఫాగింగ్ చేయించాలని, ఫ్రైడే – డ్రైడే పక్కాగా అమలయ్యేలా చూడాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పొందిన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ళ్ల లబ్ధిదారులకు ఇప్పటికే రూ. 30 కోట్ల పైచిలుకు రుణ సదుపాయం అందించామన్నారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రాకపోతే, అలాంటి వారి నుంచి రాతపూర్వకంగా లేఖలు తీసుకుని జాబితా నుంచి పేర్లను తొలగించాలని, వారి స్థానంలో అర్హత కలిగిన ఇతరులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ళను అర్హులైన వారికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీవో ఆఫీసులో ప్రజాపాలన సేవా కేంద్రం కొనసాగుతున్న విషయం ప్రజలందరికి తెలిసేలా కార్యాలయం వద్ద ఫ్లె క్సీ ని ఏర్పాటు చేయించాలని సూచించారు. కాగా, ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్, ఎరువుల నిల్వలను పరిశీలించారు. అక్కడికి వచ్చిన స్థానిక రైతులతో మాట్లాడి, ఎరువులు సరిపడా అందుతున్నాయా అని ఆరా తీశారు. జిల్లాలో ఎప్పుడు కూడా 11 వేల మెట్రిక్ టన్నుల వరకు ఎరువుల నిల్వలు మిగిలి ఉండగానే, కొత్తగా ఎరువుల స్టాక్ తెప్పించుకోవడం జరుగుతోందని అన్నారు. రైతులు ఒకేసారి కాకుండా తమ అవసరాలకు అనుగుణంగా ఎరువులను తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

