- ఏఐపికేఎంఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి ఇ.రమేష్
సిరికొండ, బతుకమ్మ : ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ కూలీలందరికి ఆత్మీయ భరోసా ఇవ్వాలని, ఇందిరా ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రూ.12వేలు వ్యవసాయ కూలీలందరికి ఇచ్చి అమలు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.పి.కే.ఎం.ఎస్)జిల్లా ప్రధానకార్యదర్శి ఇ. రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇందిరా ఆత్మీయ భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్ తో తహసీల్దార్ కార్యాలయాల ముందు ధ గురువారం ధర్నా నిర్వహించి,తహసీల్దార్ రవీందర్ రావుకు డిమాండ్స్ కూడిన మెమోరాండం అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల హామీగా 12 వేల రూపాయలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి వ్యవసాయ కూలికి ఇస్తానని హామీ ఇచ్చారని, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక, ఇప్పటివరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు అతిలేదు గతి లేదు అని ఆవేదన వ్యక్తం చెశారు. వ్యవసాయ కూలీలను పూర్తిగా విస్మరించారన్నారు. తన ఎన్నికల హామీని తుంగలో తొక్కారని,గంపెడి ఆశతో ఓట్లు వేసి గెలిపించిన వ్యవసాయ కూలీలకు హామీని అమలు చేయకుండా మొండి చేయి చూపారన్నారు. తూతూ మంత్రంగా అర, కొర కూలీలకు జీవన భృతిని ఇస్తున్నట్టు ప్రకటించి అవికూడా పేర్లు ప్రకటించి డబ్బులు ఇవ్వకుండా చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో 80 శాతం మంది వ్యవసాయ కూలీలేనని, రెక్కడితే గాని డొక్కనిండదన్నారు. ఒకవైపు వ్యవసాయ రంగంలో ఆధునీకరణ, మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వలస వచ్చి పనులు చేయడం వలన ఇక్కడి వ్యవసాయ కూలీలకు ఎలాంటి పనులు లేకుండా ఉపాధి కోల్పోయిన దుస్థితి ఉన్నదని, పనులు లేక చేతిలో చిల్లిగవ్వ లేక నాలుగు మెతుకులు మింగలేని వైనం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా తమ హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా వ్యవసాయ కూలీల దుస్థితిని మానవత దృక్పథంతో అర్థం చేసుకొని ఇస్తానన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలను ప్రతి కార్మికుడికి వెంటనే ఇవ్వాలని లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తాం అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, మండల నాయకులు వి. భూమాగౌడ్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.పి. కే. ఎం. ఎస్)ఉపాధ్యక్షులు బి. కిశోర్, జిల్లా సహాయ కార్యదర్శి జి. సాయిరెడ్డి, జిల్లా కోశాధికారి ఎస్. కిశోర్ జిల్లా డివిజన్, మండల నాయకులు కట్ట. రాములు, జి.ఎర్రన్న, నిమ్మల. రాములు, పీ ఓ డబ్ల్యూ మండల అధ్యక్షురాలు ఇ. జమున, మండల నాయకులు కుమ్మరి. గంగు, ఇ. స్వరూప, మాస్ లైన్ నాయకులు జి.రాంచందర్, కటికే. మేతిలాల్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
