28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  •  రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
  •  జూన్ 12న పండగ వాతావరణంలో పాఠశాలల పున:ప్రారంభం
  •  సీ.ఎస్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష

 

నిజామాబాద్, బతుకమ్మ : మహిళా సమాఖ్య కార్యకలాపాల నిర్వహణ కోసం ఆయా జిల్లాలలో చేపట్టిన నూతన ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, నవంబర్ నెల లోపు పూర్తి చేసేలా చొరవ చూపాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి  శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తో కలిసి మంత్రి సీతక్క,  బడి బాట, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లను సమన్వయం చేసుకుంటూ నిర్దేశించుకున్న గడువు లోపు మహిళా శక్తి భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఏకరూప దుస్తులు కుట్టి ఇచ్చే బాధ్యతలను మహిళా సంఘాలు సమర్ధవంతంగా నిర్వహించాయని, ఇప్పటికే 90 శాతం వరకు 12 లక్షల 83 వేల పైచిలుకు యూనిఫామ్ ల స్టిచ్చింగ్ పూర్తయ్యిందని అభినందించారు. మిగతా పది శాతం పనులను కూడా వేగంగా జరిపించాలని, విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి ప్రతి విద్యార్థికి ఏకరూప దుస్తులు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరగాలని, ప్రజాప్రతినిధులను సమన్వయము చేసుకుని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రి సూచించారు. పాఠశాలల పునః ప్రారంభోత్సవం సందర్భంగా పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, పరిసరాలను పరిశుభ్రం చేయించాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, విష సర్పాలు, క్రిమి కీటకాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా అంగన్వాడీలను బలోపేతం చేయాలని, అవసాన దశలో ఉన్న సెంటర్లను తక్షణమే వేరొక చోటికి మార్చాలని ఆదేశించారు. అన్ని అంగన్వాడీలలో మౌలిక వసతులు కల్పించాలని, రాష్ట్రంలో త్వరలో 1000 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించనున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇందులో భాగంగా మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ పంప్ లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలలో పెట్రోల్ పంప్ ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని, ఒక పెట్రోల్ పంప్ ఏర్పాటు వల్ల అనేక కుటుంబాలు బాగు పడతాయని మంత్రి సూచించారు. మహిళా సంఘాల ద్వారా రైస్ మిల్స్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన, ఆర్టీసీ అద్దె బస్సులు నడపడం వంటి అనేక కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో మహిళలకు అవగాహన కల్పిస్తూ నూతన మహిళ సంఘాలను ఏర్పాటు చేయాలని, పేదరికం అధికంగా ఉండే ప్రాంతాలలో అవగాహన కల్పిస్తూ మహిళా గ్రూపుల వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ వారిని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేర్పించాలని అన్నారు. మహిళలు వ్యాపారాల నిర్వహణ కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీల వల్ల ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి తలెత్తకుండా మహిళా సంఘాలలో వారిని విరివిగా చేర్పిస్తూ, మహిళా సాధికారత సాధన లక్ష్యానికి చొరవ చూపాలన్నారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ గాంధీ జయంతి నాటికి పూర్తి చేయాలని అన్నారు. ప్రతి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం సబ్ స్టేషన్ పరిధిలో 8 ఎకరాల అనువైన భూమి పది రోజుల్లో గుర్తించాలని గడువు విధించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు మాట్లాడుతూ, 100 శాతం పిల్లలు బడులలో నమోదు కల్గి ఉండాలని అన్నారు. బడికి వచ్చే పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. వేసవి సెలవులలో జిల్లా కలెక్టర్ల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు లక్షా 12 వేల మంది ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు నూతన బోధన పద్ధతులపై విజయవంతంగా శిక్షణ అందించామని అన్నారు. పాఠశాలలు ప్రారంభించిన మొదటి రోజే పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తుల పిల్లలకు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. బడి బాట కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలు, ఏ.ఐ టూల్స్ ద్వారా అందిస్తున్న ప్రాథమిక విద్య, డిజిటల్ తరగతులు, పాఠశాలల్లో వచ్చిన మార్పులను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ బడులను క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ, పనితీరు మెరుగుపడేలా, నాణ్యమైన విద్యా బోధన జరిగేలా కృషి చేయాలని కలెక్టర్లకు హితవు పలికారు. ప్రభుత్వ పాఠశాలల ఏకరూప దుస్తులు కుట్టిన మహిళలందరికి కుట్టు కూలీ 75 రూపాయల చొప్పున ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ నిధులను సంబంధిత మహిళలకు త్వరగా చేరేలా చూడాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ, డీపీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈ.ఈ శంకర్, ఏపీడీ రవీందర్, ఐకెపి డీపీఎం సాయిలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Construction of Indira Mahila Shakti buildings should be completed soon

More articles

Latest article