- రేషన్ బియ్యం పంపిణిలో డిలర్లకు కొత్త కష్టాలు
- మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి తకరారు
- కనీసం ఈ పాస్ రోల్ సరఫరా లేదని డీలర్ల ఆవేదన
నిజామాబాద్, బతుకమ్మ : జమ్మూకాశ్మీర్ లోని పహల్గం ఉదంతం తర్వాత దయాది పాకిస్తాన్ తో భారత్ యుద్దం తప్పదని ఆపరేషన్ సిందూర్ తో స్పష్టమైంది. వారం రోజుల యుద్దమేఘాలు కాస్తా ఆపరేషన్ సింధూర్ తర్వాత చల్లబడ్డాయి. ఆ తరుణంలో దేశంలో ప్రజలు ఇబ్బంది పడవద్దని మూడు నెలల నిత్యవసర సరుకులను పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దాని ప్రకారం ఆగమేఘాల మీద ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. యుద్దమేఘాలు ఎక్కడికక్కడ కరిగిపోవడంతో మళ్లీ నిత్యవసర సరుకుల పంపిణీకి ఎక్కడ వరదలు ఇబ్బందులు పెడుతాయోనని జూన్ మాసంలోనే పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం విధితమే. ఒకప్పుడు రేషన్ డీలర్లు నెలలో పది రోజులు ఆడుతూ పాడుతూ రోజుకు 200 మందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసేవారు. అందులో ప్రధానంగా కేంద్రం ఇచ్చే ఐదు కిలోల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కిలో బియ్యంను కలిపి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ జరిగేది. అదంతా పహల్గం ఉదంతానికి ముందుగా ఉండేది. మూడు నెలల నిత్యవసర సరుకుల పంపిణీకి రేషన్ డీలర్లకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి.

రేషన్ కార్డులో ఉన్న లబ్దిదారులకు బియ్యం పంపిణీ అంటే డీలర్లకు తలప్రాణం తోకలోకి వస్తుందని వాపోతున్నారు. కేంద్రం ఇచ్చే ఐదు కిలోల బియ్యం బరువును ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కిలో బియ్యం బరువును మరోసారి అన్నచందంగా తూకం వేయాల్సి వస్తుందని వాపోతున్నారు. జూన్, జులై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యం పంపిణీ కోసం మూడుసార్లు థంబ్ . . . ఆరుసార్లు వెజ్ మెంట్ చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో నిత్యవసర సరుకుల బియ్యం నిల్వలు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. కేంద్రం సన్నబియ్యం ఇవ్వడం, మూడు నెలల నిత్యవసర సరుకులు ఒకేసారి అని ప్రచారం చేయడంతో రేషన్ దుకాణాల వద్ద ఉదయం మొదలుకుని రాత్రి వరకు నిరంతరాయంగా పంపిణీ జరుగుతుంది. మూడు నెలల బియ్యం కోసం కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్య ఆధారంగా కిలోల కొద్ది బియ్యాన్ని తరలించేందుకు మహిళలకు తోడుగా పురుషులు వస్తుండడంతో రేషన్ దుకాణాల వద్ద భారీ క్యూలు కనబడుతున్నాయి.
ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల బియ్యం మూడు నెలలు 18 కిలోల బియ్యం పంపిణీ ప్రక్రియ ఇప్పుడు జిల్లాలో జోరుగా సాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో 759 దుకాణాలలో 3 లక్షల పైచిలుకు రేషన్ కార్డుల లబ్దిదారులకు బియ్యం పంపిణీ జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో 578 రేషన్ దుకాణాల్లో 2 లక్షల 80 వేల మందికి నిత్యవసరల సరుకుల పంపిణీ జరుగుతుంది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరా నిరంతరాయంగా జరుగుతుండగా ఈపాస్ మిషన్ లకు సంబంధించిన పేపర్ రోలర్ మాత్రం సరఫరా లేదని డీలర్లు వాపోతున్నారు. గతంలో పది రోజులు ఆడుతూ పాడుతూ పని చేస్తే గానీ పంపిణీ పూర్తయ్యేదని మూడు నెలల సరుకుల కోసం ఈ నెల 20 వరకు నిరంతరాయంగా పని చేయాల్సి వస్తుందని డీలర్లు చెబుతున్నారు.

