- 50 మంది మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి రాని వేతనాలు
- బల్దియా సిబ్బంది వేతనాలు వచ్చే దారేది
- సెక్షన్ మార్చి వదిలేసిన అధికారులు
- వేతనాలు ఇప్పించాలని కోరుతున్న పట్టించుకునే వారేరి
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేస్తున్న పారిశుధ్ద్య కార్మికులకు వేతనాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 500 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తుండగా 50 మందికి మాత్రమే మార్చి మాసానికి సంబంధించిన వేతనాన్ని పారిశుద్ధ్య కార్మికుల ఖాతాలో జమ చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతి పనికి డబ్బులు వసూల్ చేస్తున్న విషయం విధితమే. ఇటీవల కాలంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పేరేషన్ లో బల్ధియా సిబ్బందిని నియమించిన పొరుగు సేవల సంస్థ (ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ)ని మార్చిన విషయం తెల్సిందే. సంబంధిత వేతనాలు చేసే సెక్షన్ అసిస్టెంట్ ఒకరు కొత్తగా వచ్చిన ఏజెన్సీ నిర్వాహకుల వద్ద డబ్బులు డిమాండ్ చేయడంతో వారు ససేమిరా అన్నారు. దానితో సంబంధిత సెక్షన్ అసిస్టెంట్ ఫిబ్రవరి మాసంలో ఎవరికైతే వేతనాలు చేశారో వారి ఖాతాలోనే జీతం డబ్బుల నమోదుకు సిఫారసు చేశారు. దాంతో మార్చి నెలలో పని చేసిన సిబ్బందికి వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.14 వేలకే పారిశుద్ద్య పనులు చేస్తున్న పేద వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై కార్మిక సంఘాలు, పారిశుద్ద్య సిబ్బంది నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ నెల రోజులు గడిచిన వేతనాలు అందకపోవడంతో పేద వారైనా పారిశుధ్ద్య సిబ్బందికి తిప్పలు తప్పడం లేదు. సంబంధిత సిబ్బందికి వేతనాలను జమ చేయడంలో డబ్బులు డిమాండ్ చేసిన సెక్షన్ అసిస్టెంట్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా డబ్బులు దండిగా వచ్చే మరో సెక్షన్ కు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. పారిశుద్ద్య సిబ్బంది చేసిన సిబ్బందికి వేతనం అందించకుండా వారి పొట్ట కొట్టిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై బల్దియా అధికారులకు ప్రేమ ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. పారిశుద్ద్య సిబ్బంది తాము పని చేస్తున్న ప్రాంతాల్లో ఐదు, పది రూపాయలు అడిగినా వారిపై చర్యలు తీసుకుంటామని నిత్యం బల్దియా ఉద్యోగుల గ్రూప్ లో హెచ్చరికలు చేసే అధికారులు ఒక ఉద్యోగి ధన దాహానికి 50 మంది పారిశుద్ద్య కార్మికులు ఇక్కట్లు పడుతుంటే వారికి వేతనాలు జమ చేయకపోవడం ఏమిటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పని చేయని వారికి పూర్తి వేతనాలు రాగా పని చేసి వేతనం అడిగిన వారు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో తలెత్తింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు జిల్లా కలెక్టర్ ప్రత్యేకాధికారి అయినప్పటికీ ఈ విషయాన్ని ఆయన వద్దకు చేరకుండా బల్దియా అధికారులు మేనేజ్ చేయడం విశేషం. 50 మంది కార్మికులకు సంబంధించిన వేతనాలు ఇతరుల ఖాతాలో జమ అయిన వాటిని రికవరి చేయకుండా అందుకు బాధ్యుడైన సెక్షన్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోకుండా బల్దియా అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతుంది. లక్షల రూపాయల వేతనాలు తీసుకుంటున్న రెగ్యులర్ ఉద్యోగులు పారిశుద్ద్య కార్మికుల బాగోగులు పట్టించుకోకపోవడం ఏమిటని కార్మిక సంఘాలు నోరుమెదకపోవడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి.
