- జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పిసీపిఎన్డీటీ చట్టాన్ని అతిక్రమించి గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ నిర్వహించి పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అని తెలిపే స్కానింగ్ సెంటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ హెచ్చరించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలోని మూడు డివిజన్ లలో ప్రత్యేక బ్రుందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా రిజస్టర్ చేయకుండా పరీక్షలు నిర్వహిస్తే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీసీపీఎన్ఢీటీ చట్టం ప్రకారం ప్రతి స్కానింగ్ చేసే వారకి విధిగా రిజస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. ఫాం ఎప్ మెయింటేన్ చేయాలని, ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారికి స్కానింగ్ నిర్వహిస్తే పూర్తి వివరాలు నమోదు చేయాలని అన్నారు. యోగ్యత కలిగిన వైద్యులు మాత్రమే స్కానింగ్ చేయాలని, ఇతరులు ఎవరైనా చేస్తే ఆ స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో రెండు ఆసుపత్రులలో కొత్త స్కానింగ్ యంత్రాలకు అనుమతినిస్తూ బోధన్ లోని ఒక స్కానింగ్ యంత్రం ఉన్న ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పిఓ ఎంసీహెచ్ డా.సుప్రియ, గైనకాలజిస్ట్ డా.బిందు, రేడియాలజిస్ట్ డా.శ్రావణి, పిడియాట్రిషియన్ డా.హరిప్రియ, డ్రగ్ ఇన్స్ పెక్టర్ శ్రీలత, సీడీపీఓ సౌందర్య, ఎన్జీవో పద్మాసింగ్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాధ తదితరులు పాల్గొన్నారు.

