. అధికారిక కార్యక్రమంపై నిర్లక్ష్య వైఖరి
. అసహనం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: అధికారికంగా నిర్వహించాల్సిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని అధికారులు నిర్లక్ష్యం చేశారు. తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని ఏర్పాటే చేసి చేతులు దులుపుకున్నారు. అంబేడ్కర్ సంఘాలు, దళిత సంఘాలకు సరైన సమాచారం లేకపోవడంతో అధికారిక కార్యక్రమం వెలవెలబోయింది.
జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సరైన సమాచారం ఇవ్వకపోవడంతో జనాలు లేక కార్యక్రమం వెలవెలబోయింది. సుమారు ఐదు వందల సీటింగ్ సామర్థ్యం ఉన్న ఆడిటోరియంలో కనీసం వంద మంది కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
నాయకులు తప్ప ఎవరూ లేకపోవడంతో నగరంలోని కంఠేశ్వర్ లో గల ఎస్సీ హాస్టల్ పిల్లలను కార్యక్రమానికి తీసుకువచ్చారు. అయినప్పటికీ ఇంకా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. పులాంగ్ వద్ద నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ కార్పొరేషన్ చైర్మన్ లకు ఆహ్వానం పంపినప్పటికీ వారు వచ్చిన సమయంలో అధికారులు ఎవరూ లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

