అసమర్థ, అవినీతి ప్రభుత్వమిది

0 2,696

. ఆర్థిక క్రమ శిక్షణ లేదు

. ప్రగతిభవన్ లో లంకె బిందెలు ఉన్నాయనుకున్నావా..?

. లక్షల కోట్ల అప్పులున్నాయని తెలిసీ వాగ్దానాలు ఎలా ఇచ్చావు..?

. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ విమర్శలు

హైదారాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, అసత్యాల ప్రభుత్వం నడుస్తోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం ఆర్థిక క్రమశిక్షణ లేదని, లక్షల కోట్ల అప్పులున్నాయని తెలిసీ అమలు సాధ్యం కాని హామీలు ఎలా ఇచ్చావని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు.

తాను అధికారం చెప్పట్టే నాటికి రూ.4లక్షల కోట్ల అప్పులున్నాయని అనుకున్నానని, కానీ ఆ తరువాత రూ.7లక్షల కోట్ల వరకు అప్పులున్నాయని తెలిసిందని రేవంత్ పేర్కొన్నారని విమర్శించారు. ఎడాపెడా ఇచ్చిన వాగ్దానాలపై రేవంత్ తోపాటు ఎవరూ మాట్లాడడం లేదని, ప్రజల దృష్టిని మరల్చేందుకు హైడ్రా, మూసీ ప్రక్షాళన, సినీ పరిశ్రమ, హెచ్ సీయూ అంశాలను తెరపైకి తెచ్చారని విమర్శించారు.

లక్షల కోట్ల అప్పులున్నాయని తెలిసి వాగ్దానాలు ఎందుకు ఇచ్చారని, ప్రగతిభవన్ లో లంకె బిందెలు ఉన్నాయనుకున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ వద్ద పని చేసి దోచుకోవడంలో ఆరితేరిన అధికారులే సీఎం రేవంత్ వద్ద కనిపిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. కమీషన్లు మింగుడు తప్ప మంత్రులు చేస్తున్నది ఏమీ లేదని విమర్శించారు.

పీసీసీ పదవితోపాటు ముఖ్యమంత్రి పదవిని రేవంత్ కొనుక్కున్నారని కాంగ్రెస్ వాళ్లే అంటున్నారని, కలెక్షన్ లు బాగా చేస్తాడనే నమ్మకంతోనే కాంగ్రెస్ అధిష్టాను ఆయనకు బాధ్యతలు అప్పగించిందన్నారు. ప్రజలు రేవంత్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి ఏమీ ఒరగబెట్టని కేసీఆర్ కూతురు, కొడుక్కి అసలు మాట్లాడే అర్హత లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.