- ఇంధన ముఖ్య కార్యదర్శి సుల్తానియా
హైదరాబాద్, బతుకమ్మ: విద్యుత్ సంస్థలలో క్షేత్ర స్థాయిలో పని చేసే లైన్ మెన్, ఆర్టిజన్ ల పాత్ర ఎంతో కీలకమని ప్రభుత్వ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. జిటిఎస్ కాలనీలోని జెన్కో ఆడిటోరియంలో, బంజారా హిల్స్ సర్కిల్ పరిధిలోని మొత్తం సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికుల నుంచి సలహాలను, సూచనలను స్వీకరించారు. వివిధ రకాల విభాగాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం, విద్యుత్ యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయాలను, కింది స్థాయిలో పని చేసే కార్మికుల, సిబ్బంది వ్యవహార శైలి, పని విధానం మీదనే సంస్థ ప్రగతి, ప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయని కొనియాడారు. వేసవి కాలంలో పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టు, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నాణ్యమైన సరఫరా అందించడానికి గాను గత మూడు నెలలుగా నూతన పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, అదనపు ఫీడర్ల ఏర్పాటు వంటి అదనపు పనులను చేపట్టడం జరిగిందనారు. వేసవికాల సన్నద్ధతకు సంబంధించి గతంలో పలు మార్లు సిఎండిలు, చీఫ్ ఇంజినీర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో ఉప ముఖ్యమంత్రి పలు దఫాలుగా సమావేశాలను నిర్వహించారని గుర్తు చేసారు. దీనికి కొనసాగింపుగా, క్షేత్ర స్థాయిలో విద్యుత్ శాఖ ప్రతినిధులుగా వ్యహరిస్తున్న లైన్ మెన్, ఆర్టిసన్ లను సంసిద్ధం చేయడం కోసం అన్ని సర్కిళ్లలో క్షేత్ర స్థాయి సిబ్బందితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ యాసంగి పంటల సీజన్ లో విద్యుత్ డిమాండ్ 17162 మెగా వాట్లకు చేరిందన్నారు. విద్యుత్ వినియోగం ఇంతగా పెరిగినా సమస్యలు లేకుండా సరఫరా అందించడం వెనుక విద్యుత్ సంస్థల్లో పని చేసే సిబ్బంది అధికారుల కృషి వల్లనే ఇది సాధ్యమయ్యిందన్నారు. గత వేసవితో పోల్చుకుంటే ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే సూచనలున్నాయని, ఏప్రిల్, మే నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ లో విద్యుత్ డిమాండ్ భారీ స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయన్నారు. గతేడాది గ్రేటర్ హైదరాబాద్ లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 4352 మెగా వాట్లుగా నమోదయ్యిందని, ఈ ఏడాది 5000 మెగా వాట్లకు మించి నమోదయ్యే అవకాశముందని తెలిపారు. డిమాండ్ ఎంతగా పెరిగినా దానికి తగ్గట్టు సరఫరా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తంగా వుంటూ, ప్రతి వినియోగదారుడితో మంచి రిలేషన్ ను కొనసాగించాలని సూచించారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ మాట్లాడుతూ, వేసవి కాల సన్నద్ధతకు సంబంధించి, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సంస్థ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో వరుసగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని సర్కిళ్ల లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని సీఎండీ తెలిపారు.
