24.6 C
Hyderabad

ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ స్ట్రాటజి ఏమిటి?

Must read

📰 Generate e-Paper Clip

  • పోటీ చేయకపోతే బీజేపీ, కాంగ్రెస్ లలో ఎవరికి మేలు
  • స్వతంత్రులకు ఎవరికి కలిసొచ్చెనో
  • బలమైన ప్రతిపక్షం పోటీకి వెనుకడగులో ఆంతర్యమేమిటి
  • స్థానిక సంస్థల ఎన్నికల కోసమే వెనుకడుగ

నిజామాబాద్, బతుకమ్మ
ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న బీఆర్ఎస్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనుకడుగు వేయడంపై కొత్త చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన వరకు పోటీకి సై అన్న బీఆర్ఎస్ తర్వాత మౌనం వహించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ నాయకుడు, ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్ పోటీ చేస్తానని ప్రచారం కూడా చేశారు. కరీంనగర్ కు చెందిన మాజీ మేయర్, బీఆర్ఎస్ నేత సర్ధార్ రవీంధర్ సింగ్ తాను పోటీలో దిగేది ఖాయమని ప్రకటించారు. రాజారాంయాదవ్ కు టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చిన విషయం తెల్సిందే.

రవీంధర్ సింగ్ కోసం మాజీ మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత బీఆర్ఎస్ పోటీపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజారాంయాదవ్ పోటీలో ఉండాలా లేదా అనే డైలామాలో ఉన్నారు. కానీ రవీంధర్ సింగ్ మాత్రం ప్రచారం చేసుకుని బరిలో ఉంటారని చెప్పకనే చెబుతున్నారు. ఈ నెల 10తో నామినేషన్ల గడువు ముగియనుండగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీపై ఎలాంటి ప్రకటన రాకపోవడం బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

నాలుగు పూర్వపు జిల్లాలు, 42 అసెంబ్లీ స్థానాల్లో సంబంధించిన గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓట్లు వేసే ఎన్నికలలో బీఆర్ఎస్ వ్యూహం ఏమిటనేది అంతుచిక్కడం లేదు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సై అనకపోవడం వెనుక ఆంతర్యం పార్టీలో పెద్ద నాయకులు నోరు మెదకపోవడం శ్రేణుల్లో గందరగోళానికి దారి తీసింది. గడిచిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత అసలు బీఆర్ఎస్ పోటీపై అభ్యర్థులు ఆసక్తి చూపుతారా అన్న సంశయాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత ఎన్నికల సమయంలో మౌనమంత్రాన్ని పటించారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి,రెండు స్థానాల్లో బీఆర్ఎస్ బోణి కొట్టినా, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్థానికులు ముందుకు వచ్చినా కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీలో నైరాశ్యం నెలకొంది. రేపోమాపో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుండగా అంతకుముందే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నకలలో పోటీ చేస్తారా లేదా అనేది సమాచారం తమకే లేదని ఎమ్మెల్యేలు, మాజీలు పేర్కొంటున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే 48 గంటల్లో నామినేషన్ దాఖలు చేయాల్సిన బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పోటీ చేయరనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. ఒకవేళ పార్టీ అధినేత ప్రకటన చేయకపోవడంతోనే తాము బరిలో ఉండడం లేదనే సంకేతాలను ముందుగానే ఇచ్చేశారని పార్టీలో చర్చించుకుంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పోటీ చేయకపోతే ఇప్పటికే అభ్యర్థులను బరిలో నిలిపి నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ, కాంగ్రెస్ లలో ఏ పార్టీకి లాభమనే చర్చ మొదలయింది. 42 నియోజకవర్గాలలో 4 పార్లమెంట్ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఉండగా, ఆ పార్టీకి బీఆర్ ఎస్ ఓటు బ్యాంక్ మళ్లుతుందనే చర్చ జరుగుతుంది. అదే సమయంలో నాలుగు పాత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులతో బలంగా ఉండగా అభ్యర్థులను బట్టి ఓటర్లు ఓట్లు వేస్తారని చర్చ కూడా జరుగుతుంది.

అయితే రెండు జాతీయ పార్టీలను కాదని స్వతంత్రులకు ఓట్లు వేసే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతుంది. రవీంధర్ సింగ్ తాను బరిలో ఉండాలని ప్రకటించగా ఆయనకు బీఆర్ ఎస్ బీఫాం దక్కకపోతే స్వతంత్రుడిగానే బరిలో నిలువడం ఖాయమైంది. ఆయనతో పాటు మరికొందరు బీఆర్ఎస్ సానుభూతిపరులు బరిలో ఉంటుండడంతో బీఆర్ ఎస్ సానుభూతిపరులు, మేధావులు స్వతంత్రుల వైపు మొగ్గు చూపుతారనే పార్టీలో అనుకుంటున్నారు. 48 గంటల్లో నామినేషన్ల గడువు ముగియనుండగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏమిటనేది పార్టీ వర్గాలతో పాటు ప్రజల్లోనూ చర్చించుకుంటున్నారు.

More articles

Latest article