- పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : ఉస్మానియా దవఖానా శంకుస్థాపన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయిన వ్యవహరం అధికార కాంగ్రెస్ లో కలకలం రేపింది. శుక్రవారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫాంహౌజ్ లో పది మంది ఎమ్మెల్యేలు విందు చేసుకోవడం అందులో రాజకీయాలపై కొత్త చర్చ మొదలయింది. రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన క్యాబినెట్ మంత్రి వ్యవహర శైలిపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారని జరిగిన భేటీపై రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలయింది. స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో తిరుగుబాటు అనే పదం చర్చకు దారితీసింది. ఆ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారనిప్రచారం జరిగింది. అయితే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాత్రం హజరైనట్లు తెలిసింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు సమావేశానికి హాజరైనట్లు ప్రచారం జరిగిన తాను మూడు రోజులుగా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నానని తాను ఎమ్మెల్యేల భేటీకి హాజరైనట్లు జరుగుతున్న ప్రచారం అంతా బూటకమని కొట్టిపారేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేల భేటీలో భూపతిరెడ్డి హాజరుకాగా అందులో పార్టీకి వ్యతిరేకంగా సమావేశమయ్యారా? ప్రభుత్వంపై నిరాశతో హాజరయ్యారా? అని చర్చ జరుగుతుంది. అయితే అది సాధారణ సమావేశమేనని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది.

