27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

విభజన సరే.. తరలింపు ఎప్పుడు..?

Must read

📰 Generate e-Paper Clip

  •  కార్యాలయం ఏర్పాటుపై మీనమేషాలు
  • డిచ్పల్లికి వెళ్లేందుకు సిబ్బంది అనాసక్తి         
  • ఆ ఒక్కడి నిర్వాకం వల్లనేనా..? 

నిజామాబాద్ బతుకమ్మ :  డిచ్పల్లి డివిజన్ విభజనకు కసరత్తు మొదలైనా..కార్యాలయం ఏర్పాటులో మీనమేషాలు ఏర్పడుతున్నాయి. సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేసి కార్యాచరణ మొదలెట్టాలని ఈ నెల 23న ఆప్షన్స్ ప్రకటనను ఎస్ ఈ రవీందర్ విడుదల చేశారు.  రెండేళ్ల కింద మంజూరైన డివిజన్ ను కాంపౌండ్ లోనే ఉంచి పాలనపరమైన బాధ్యతలను నిజామాబాద్ డివిజన్ పరిధిలో  ఉంచారు. వినియోగదారుల సేవలకు విఘాతం కలుగుతోందని డివిజన్ ను తరలించి పూర్తి కార్యకలాపాలు ప్రారంభించాలని కంపెనీ నుంచి ఆదేశాలు వస్తున్నాయి. దీంతో ముందుగా ఓ అండ్ ఎం, ఈ ఆర్ ఓ సిబ్బందిని విభజించి డిచ్పల్లి డివిజన్ పరిధిలో పనులు జరిగేలా చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

 తరలింపు ఎప్పుడు…?

సిబ్బందిని ఆప్షన్స్ ప్రకారం విభజించేందుకు ప్రకటన వెలువరించారే గాని, కార్యాలయాన్ని డిచ్పల్లికి ఎప్పుడు తరలిస్తారనే ప్రశ్నలు, సందేహాలు కాంపౌండ్ లో వినిపిస్తున్నాయి. మంజూరైన తర్వాత రెండేళ్లుగా విభజన ప్రక్రియను పూర్తి చేయడంలో అలసత్వాన్ని అవలంభించారు. కార్యాలయం తరలించడాన్ని అడ్డుకొని, ఇంకొంత కాలం కాంపౌండ్ లో ఉంచేందుకు అందులోని కొంత సిబ్బంది చూస్తున్నట్లు తెలుస్తోంది. విభజన ప్రక్రియ పూర్తయ్యే లోపు డివిజన్ లో పూర్తిస్థాయిలో పనులు నడిచేలా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ సిబ్బంది నుంచి వినిపిస్తోంది.

 కార్యాలయంపై ఏర్పాటుపై….

డివిజన్ లో పనులు చేసేందుకు కార్యాలయం అవసరం ఉంటుంది. దీనికోసం ఇప్పటివరకు వెతికిన దాఖలాలు లేవనే మాటలు కాంపౌండ్ లో వినబడుతున్నాయి. సిబ్బంది విభజన జరిగే లోగా కార్యాలయం అన్ని సౌకర్యాలతో, పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. డివిజన్ కార్యాలయం కోసం అనువైన భవనాలను వెతకడంలో అధికారులు, సిబ్బంది  నిర్లిప్తతను  కనబరుస్తున్నారని తెలుస్తోంది.

 ఆ ఒక్కడి నిర్వాకం వల్లే….

డివిజన్ మంజూరయ్యాక ప్రధాన రహదారి పక్కన ఉన్న 132 కెవి ఉప కేంద్రంలో కార్యాలయాన్ని తాత్కాలికంగా ప్రారంభించారు. డివిజన్ కు చేరవలసిన ఉత్తరప్రత్యుత్తరాలు అదే చిరునామాపై కొనసాగుతున్నాయి. ఈ కార్యాలయం ఇక్కడ ఉండేకన్నా కాంపౌండ్ లో ఏర్పాటు చేస్తేనే సౌకర్యంగా ఉంటుందని వినాయక్ నగర్ నుంచి ధర్మారం మార్గంలో ఉన్న ఒక సంఘ నాయకుడు తన కుటిల నీతిని ఉపయోగించాడు. వినియోగదారుల గురించి తమకెందుకు… తాను బాగుంటే చాలనే ధోరణిలో ఉన్న ఆ వ్యక్తి, అనుకున్న ప్రకారమే కాంపౌండ్ లోకి డివిజన్ కార్యాలయం వచ్చేలా చేశాడు. అరకొర సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, తానైతే జిల్లా కేంద్రంలో ఉన్నాననే సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడని సహోద్యోగులే పలుమార్లు విమర్శనలు చేసినట్లు తెలిసింది. సంఘ నాయకుని స్వార్థపూరిత ఆలోచనల వల్ల డిచ్పల్లిలో ఉండాల్సిన కార్యాలయం పవర్ హౌస్ లో ప్రత్యక్షమైంది.  ఈఆర్ఓ విభాగం సిబ్బందిలో కొందరు డిచ్ పల్లికి వెళ్లాలని యోచిస్తుండగా, ఇంకొందరు ఇక్కడే ఉండాలని సంఘ నాయకునికి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది.

More articles

Latest article