ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత
నిజామాబాద్, బతుకమ్మ : నాగారంలోని 10వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడారు. ఈ సమస్యను వార్డు కౌన్సిలర్లకు, మున్సిపల్ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి గతంలో చాలా సార్లు తీసుకువెళ్లామని తెలిపారు. నాగరానికి చెందిన 10వ వార్డులోని టైలర్స్ కాలనీలో మురికి నీరు ఎక్కడికక్కడ నిలువ ఉండడం వల్ల అక్కడే ఉంటున్న దాదాపు ఒక 50 కుటుంబాలు అనారోగ్యాల పాలవుతూ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే మంచినీటి కొరత ఉండడం వల్ల బోరు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లి నీరు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కాబట్టి మున్సిపల్ అధికారులు టైలర్స్ కాలనీ పై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ ప్రజల్ని ఈ సమస్యల నుంచి విముక్తి కలిగించాలని కోరారు. లేదంటే ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు లత, రేఖ, సుగుణ, లక్ష్మి, కవిత, జ్యోతి, దేవి తదితరులు పాల్గొన్నారు.
