నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ క్రికెట్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర ఆరంభంలో “తెలంగాణ గోల్డ్ కప్ 2025” క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నామని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో టి సి ఎ నిజామాబాద్ జిల్లా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీఐ గుర్తింపు కోసం “రూరల్ క్రికెట్ ఆన్ గ్లోబల్ వికెట్” అనే అనుసంధానంతో తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల లో ఉన్న అన్ని జిల్లాలలో తెలంగాణ క్రికెట్ వ్యాపించి ఉందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు ప్రైమ్ మినిస్టర్ కప్, తెలంగాణ గోల్డ్ కప్, ఆల్ స్టార్ క్రికెట్ కప్, ఫ్రీడమ్ కప్ పేర్లతో ఎన్నో విధాలుగా వివిధ వయోపరిమితులలో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించామన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ తో సహా 32 జిల్లాలలో ఈసారి తెలంగాణ గోల్డ్ కప్ పేరుతో క్రికెట్ సంబరాలు జరుపుకోనున్నామన్నారు. స్థానిక నిజామాబాద్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా జనవరి నెలలో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నామన్నారు. అయితే ముందుగానమోదు చేసుకున్న 32 జట్లకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించే ఈ టోర్నమెంట్ లో టాలెంట్ సర్చ్ ను సైతం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ టోర్నమెంట్ లో ఓపెన్ ఏజ్ గ్రూపులో నిర్వహించే ఈ మ్యాచ్లలో ప్రధానంగా యువతకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు రూ. 50వేల నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు రూ. 25 వేల నగదు బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ల ద్వారా ఆసక్తి ఉన్న క్రీడాకారులను స్థాయిలో ప్రాతినిధ్యం వహించేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పై స్థాయిలో నిర్వహించే టోర్నమెంట్లు, శిక్షణ శిబిరాలకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ టోర్నమెంట్ కు వివిధ సంఘాలు, విద్యాసంస్థలు, క్రీడా సంఘాలు, యువజన సంఘాలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ టోర్నీ నిర్వహణ కోసం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అందుబాటులో ఉన్న రెండు మూడు మైదానాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్ జనవరి మొదటి వారంలో ప్రారంభమై సంక్రాంతి లోపు ముగించే విధంగా ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. వందలాది సంఖ్యలో ఎంట్రీలు వచ్చే అవకాశం ఉన్నందున నిర్వాహణ కమిటీ నిబంధనల మేరకు కొంత ఎంట్రీ ఫీజును నిర్ణయించామన్నారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక టిసిఏ నిర్వాహకులు తెలియజేస్తారన్నారు. ఏది ఏమైనాప్పటికీ టాలెంట్ సర్చ్ కోసం ఒక పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సుమారు 10 నుంచి 12 రోజులపాటు ఈ “తెలంగాణ గోల్డ్ కప్” క్రికెట్ కొలహాలం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని నిజామాబాద్ జిల్లా క్రికెట్ అభిమానాలు క్రికెట్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు నయూమ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
