28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

 ‘ఫ్లెక్సీ’ మతలబేమిటో?

Must read

📰 Generate e-Paper Clip

. పర్యాటక రంగంపై ప్రేమ పుట్టకొచ్చింది ఎవరికి..

. ఉద్ధేశం ఒకటి..? పబ్లిసిటీ మరొకటా..?

. అధికారులను బ్లాక్ మెయిల్ చేసేందుకేనా?

. బద్నాం చేసి బలి చేసేది ఎవరినో..

నిజామాబాద్, బతుకమ్మ: ‘పర్యాటక రంగంపై రెడ్ టేపిజం’ అంటూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు చౌరస్తాల్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ‘‘కొంత మంది అధికారుల కబంధహస్తాల్లో పర్యాటక రంగం చిక్కిందని, అన్ని వివరాలతో మీ ముందుకు..’’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తులు రాత్రికిరాత్రే వాటిని తీసివేశారు. అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది ఎవరు? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. నిజామాబాద్ జిల్లాలో చెప్పుకోదగిన స్థాయిలో టూరిజమే లేనప్పుడు ఈ ఫ్లెక్సీల ఏర్పాటు వెనుక మతలబు ఏమిటి? వేరే ఉద్దేశంతో ఉన్న వ్యక్తులు అధికారులను బ్లాక్ మెయిల్ చేసేందుకే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

ఉన్నవి ఇరిగేషన్ ప్రాజెక్టులే..

జిల్లాలో చెప్పుకోదగిన స్థాయిలో టూరిజం స్పాట్ లేకపోగా, ఉన్నవి కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులు మాత్రమే. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సందర్శకులకు అదీ సీజన్ లోనే ఎంతోకొంత ఆహ్లాదాన్ని పంచే స్పాట్.  ఇక మిగిలినవి రెండు హోటళ్లను ఎన్నడో ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయగా దానిపై అధికారుల అజమాయిషీ నామా మాత్రంగానే ఉంది.  ఇక ఉన్నది ప్రైవేట్ టూరిజమే అయినప్పటికీ అలాంటివి జిల్లాలో వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. మరి అధికారుల కబంధ హస్తాల్లో టూరిజం ఎక్కడ ఉంది? అనే ప్రశ్న తలెత్తుతోంది. టూరిజంపై రెడ్ టేపిజం అనేందుకు అనవసరమైన ప్రభుత్వ నిబంధనలను అమలు చేస్తోంది ఎవరు? ఫ్లెక్సీలు పెట్టిన వ్యక్తులను వేధిస్తున్న బ్యూరో క్రాట్లు ఎవరు? అని ప్రశ్నిస్తున్న నగరవాసులు ఇదంతా అధికారులను బ్లాక్ మెయిల్ చేసే వ్యవహారమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి రహిత పాలన అందిస్తున్నామని కాంగ్రెస్ వాళ్లు గొప్పలు చెబుతుండగా, ఇటీవల కాలంలో ఆ పార్టీ పేరును వాడుకోవడాన్ని పెంచిన వారే ఉన్నతాధికారులను టార్గెట్ చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని పలువురు పేర్కొంటున్నారు.  ఇదిలా ఉండగా పోలీసులు, అధికారులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిసింది.

సీజింగ్ నుంచి బయటపడేందుకేనా?

నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేట్ వివాదాస్పద టూరిస్ట్ రిసార్ట్ కోసమే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో అక్కడ వివాదం జరగగా, పలువురిపై రిసార్ట్ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో దానిని పోలీసుశాఖ మూసివేసింది. దానిని తిరిగి తెరిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటి పోలీస్ బాస్ ఖరాఖండిగా నో చెప్పారు. అప్పటి సీపీ ముందు తన పప్పులు ఉడకకపోవడంతో రిసార్ట్ యజమాని ఇప్పుడు కొత్త ప్రయత్నాలకు తెరలేపారని, ఫ్లెక్సీల ఏర్పాటు అందులో భాగమేనని ‘అంతా’ తెలిసిన వారు అంటున్నారు. తన దందాను తిరిగి తెరిపించుకునేందుకు అవసరమైతే అధికారులను రోడ్డుపైకి లాగేందుకు ఫ్లెక్సీల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని అభిప్రాయపడుతున్నారు.

More articles

Latest article