. . పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి డా.కర్క గణేష్ డిమాండ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ
తెలంగాణ రాష్ట్రంలోని గ్రూప్-1 నియామకాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాల అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే జి.ఓ. నెంబర్ 29ని రద్దు చేయాలని, జీవో నెంబర్ 55ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయం ఎదుట పీడీఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి డా.కర్క గణేష్ మాట్లాడుతూ తక్షణమే జీవో నంబర్ 29 రద్దు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా జీవో 55 పునరుద్ధరించి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ బేషజాలాలకు పోకుండా గ్రూప్-1 అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులతో చర్చలు జరపాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్ అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయాలని చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 29 రద్దు చేసిన తర్వాతనే గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ అనుసరించినటువంటి విధానాలని అనుసరిస్తూ దుందుడుకు స్వభావంతో పోవడానికి పోతే తగిన గుణపాఠం తప్పదు అన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యార్థి, గ్రూప్-1 ఇతర నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి పెద్ద ఎత్తున సంఘటితంగా ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు సాయిబాబా, రమేష్, రాజు, గ్రూప్స్ అభ్యర్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
