. ఇసుకాసురులనుంచి మామూళ్లు వసూలు చేసిన 12 మంది అధికారులు
. నాన్ ఫోకల్ పోస్ట్ లకు పంపాలన్న డీజీపీ ఆదేశాలకే దిక్కు లేదు
. నెలరోజులుగా ఆదేశాల అమలుకు మీనమేషాలు లెక్కిస్తున్న వైనం
. అడ్డుకుంటున్నది ఖద్ధరు నేతలేనా?
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో ఇసుక అక్రమ దందాలో 12 మంది పోలీసు అధికారుల ప్రమేయం ఉందని నిర్ధారణకు వచ్చిన డీజీపీ వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. 10 మంది ఎస్సైలు, ఇద్దరు సీఐలను విధుల నుంచి తప్పించాలని, వారికి నాన్ లోకల్ పోస్టులకు బదిలీ చేసి శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని అక్టోబర్ 4వ తేదీన డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ అయిన వారం, పది రోజులకు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కేంద్ర సర్వీసుకు డిప్యుటేషన్ పై వెళ్లారు. ఆ తరువాత 12 మందిపై చర్యలు తీసుకోవడం మరిచారు.
నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయలేదు…
జిల్లాలో పోలీసు అధికారుల పోస్టింగ్ లన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. వారికి పోస్టింగ్ ఇప్పించే వరకు పోలీసింగ్ లో నేతల జోక్యం పరవాలేదు కానీ.. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని వెనకేసుకురావడమనేది గతంలో ఎన్నడూ జరగలేదు. ఇసుక దందాకు సహకరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవగా, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం లోని అధికార పార్టీ నేతలు అడ్డుకుంటుండడం చర్చనీయాంశమైంది. దశాబ్దకాలం అధికారానికి దురంగా ఉన్న నేతలు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక అక్రమ రవాణాను తమ గుప్పిట పెట్టుకున్నారు. అందుకు సహకరించిన వారికి రెవెన్యూ, పోలీస్, ఇతర పోస్టులు ఇప్పించుకున్నారు. అందుకు గాను రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం మొత్తంగా వారికి సహాయసహకారాలు అందించారు. క్విడ్ ప్రోకో పద్ధతిలో ఇసుక దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగింది. ఇసుక దందాలో చేస్తున్నవారు ఆయా శాఖల అధికారులకు నెలవారీ మామూళ్లు ఇచ్చుకొని పరస్పర సహాయ సహకారాలను పొందారు.
ఉత్తర్వులు వచ్చి నెల రోజులు..
ఇసుక దందా ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్సైలను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడి నెలరోజులు గడిచిపోయింది. ఇద్దరు సీఐలలో ఒకరిని ఐజీ కార్యాలయానికి, మరొకరిని ట్రాఫిక్ కు బదిలీ చేశారు. ఎస్సైలను లూప్ లైన్ కు పంపించాల్సి ఉండగా వారికి మరోసారి అధికారులు పోస్టింగ్ లు ఇవ్వడం వివాదాస్పదమైంది. తమకు లీడర్ల అండ ఉందని, తమపై చర్యలు ఉండవనే ధీమాలో ఎస్సైలు ఉన్నారు. ఇందుకు బలాన్ని చేకూరస్తూ ఎస్సైలను నాన్ ఫోకల్ పోస్టుల్లోకి కాకుండా ఆదాయం వచ్చే చోటికి, మళ్లీ ఇసుక అక్రమ రవాణాకు ప్రాధన్యం ఉన్నచోటకు పోస్టింగ్ ఇవ్వడం వివాదాస్పదమైంది. బోధన్ రూరల్ ఎస్సైగా పని చేసిన కాలంలో ఇసుక వ్యాపారుల నుంచి నెలకు రూ.8 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న నాగనాథ్ ను అక్కడినుంచి వేల్పూర్ కు బదిలీ చేయడం గమనార్హం. ప్రస్తుతం వేల్పూర్ లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వీడీసీ కనుసన్నల్లో పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణ అంతా ఇద్ధరు అధికార పార్టీ నేతల అండతో సాగుతోంది. రెండు రోజుల క్రితం ఈ విషయమై బీఆర్ఎస్ నాయకులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేకుండాపోయారు.
