మాస్టియన్ ల ఆవేదన
బతుకమ్మ, బీబీపేట: తరతరాలుగా ఆర్థిక, సామాజిక, రాజకీయ, సంక్షేమ సమానత్వం తరాలు మారినా తమకు మాత్రం అందని ద్రాక్ష గానే మారిందని మాస్టియన్ లు ఆవేదన వ్యక్తం చేశారు. బీబీపేట్ మండలంలోని ఇస్సానగర్ రామచంద్రపురం కాలనీలో జిల్లాస్థాయి మాస్టియన్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టియన్ రాష్ట్ర కార్యదర్శి నాగిల్ల నర్సాయ్య, రాష్ట్ర నాయకులు నాగిల్ల కిష్టయ్య, బుద్దుల రమేష్ మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల నుండి మాదిగ ఉపకులంలో ఉన్న తమకు ఎలాంటి ప్రాతినిధ్యం దక్కలేదన్నారు. అణగారిన కులాలలో అధిక సంఖ్యలో ఉన్న కులాలుగా పిలవబడుతున్న, మాల మాదిగ కులాలు తమకు దక్కాల్సిన హక్కులను దక్కకుండా ఖూనీ చేశారన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవహారాలలో పేరుగాంచిన నాయకులు రాష్ట్ర ప్రభుత్వాలు అందించినటువంటి సంక్షేమ పథకాలు తమ జాతి మనుగడకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలు దరిచేరనివ్వకుండా కుట్రపూరిత వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఏ ప్రభుత్వం కొలువుదీరితే ఆ ప్రభుత్వంతో మమేకమై తమను అనగదొక్కారని ఆరోపించారు. 30 సంవత్సరాల క్రితం అప్పుడు ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రభుత్వ భూమి కొంతవరకు అందించిన భూమికి ఎలాంటి రైతుబంధు తమ దరికి రా లేదన్నారు . మరికొంతమందికి పట్టా పాస్ పుస్తకాలు అందజేయకుండా అడంగల్ లో ఉన్నారని పదుల సంఖ్యలో మండల, జిల్లాస్థాయి అధికారులకు ఎన్ని అర్జీలు పెట్టినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని మాదిగ ఉపకులంలో ఉన్న ఐదు లక్షల జనాభా కలిగిన మాస్టియన్ కులానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, విద్యార్థులకు గురుకులాలలో ఉచిత విద్యను, ప్రభుత్వ రాయితీలు అందించాలని, సామాజిక ఆర్థిక రాజకీయ మనుగడకు తమకు ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. బీబీపేట మండలంలో 20 కుటుంబాలు నివసిస్తున్నాయని ఇంతవరకు డబల్ బెడ్ రూమ్ కానీ, ప్రభుత్వ రుణాలు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు గాని ఏవి కూడా దరిచేరలేవని, వైద్యం,విద్యకు కూడా తాము దూరంగా బ్రతుకుతున్నామని ఇకనైనా ప్రభుత్వం తమపై చిన్న చూపు చూడకుండా ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి తమను సంఘటితం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బుద్ధుల సాయిలు, బీబీపేట్ మాస్టియన్ కుల జిల్లా ఉపాధ్యక్షుడు బుద్ధుల రాజనర్సు, జిల్లా కోశాధికారి బుద్ధుల శంకర్, ఇతర జిల్లాల నాయకులు, రాములు నాగరాజు, దర్శనం శంకర్, రామకృష్ణ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
తరాలు మారినా తల రాత మారలే
