బతుకమ్మ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట సహకార సంఘాన్ని రెండు సంఘాలు గా విభజన చేయాలని నాగిరెడ్డిపేట్ మండల మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూర్ కిచ్చన్నపేట సహకార సంఘం పరిధిలో సుమారు 17 గ్రామపంచాయతీలు 20 గ్రామాలు ఉన్నాయని, తాండూర్ కిచ్చన్నపేట సహకార సంఘం చాలా పెద్దదిగా ఉన్నందున సంఘ సేవలు పొందుటకు రైతులకు చాలా ఇబ్బందిగా ఉందని, ఆత్మకూరు గ్రామాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని ఆత్మకూరు, ఎర్రారం, జలాల్ పూర్, మాటూర్, మాసానిపల్లి ఆచ్చాయిపల్లి, రామక్కపల్లి గ్రామాలను కలుపుకొని నూతన సంఘంగా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారన్నారు. ప్రస్తుతం తాండూర్ సహకార సంఘంలో ఏడు గ్రామాల సభ్యులు 1160 మంది ఉన్నారని తెలిపారు. ఆత్మకూరు గ్రామంలో సంఘం ఏర్పాటు చేసినట్లయితే 100 మెట్రిక్ టన్నుల గోదాం మరియు ఒక ఎకరం ఒక గుంట స్థలం ఉందని డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డికి మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి వివరించి వినతి పత్రం అందజేశారు.